ఇండియా కూటమిలో (INDIA Bloc) బహుజన్ సమాజ్ పార్టీ చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) కొట్టిపారేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ (BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. ఎన్నికల అనంతరం మాత్రం పొత్తుపై ఆలోచిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని గతంలోనే బీఎస్పీ స్పష్టం చేసింది. అయినా కూడా తాజాగా మరోసారి వదంతులు వ్యాపిస్తుండడంతో మాయావతి స్పందించారు. బీఎస్పీతో పొత్తు లేకుండా కొన్ని పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో రాణించలేవన్నారు. కానీ పార్టీ ఒంటరిగానే ముందుకువెళ్తుందన్నారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని మాయావతి క్లారిటీ ఇచ్చారు.
లక్నోలో మాయావతి మీడియాతో మాట్లాడారు. పొత్తులతో తమ పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండడం లేదన్నారు. దేశంలోని చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయని.. కానీ తమకు ఆ ఆలోచన లేదన్నారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని తెలిపారు. పేదలు దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైన వారి సంక్షేమాన్ని దృష్టిలోఉంచుకుని.. ప్రజాబలంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ప్రజలు మాత్రం వదంతులు నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది.. అయినా కూడా కూటమితో ఎలాంటి చర్చలు లేకుండానే అఖిలేష్ యాదవ్ సీట్లు ప్రకటించేస్తున్నారు. సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చాకే రాహుల్ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ తేల్చిచెప్పారు. ఇంకోవైపు తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించాయి. తాజాగా బీఎస్పీ అధినేత మాయావతి కూడా పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు.