అధికార వైసీపీ పార్టీపై గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఉన్మాదికి అధికారం ఇస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేందుకు అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఆయన ఇవాళ పర్యటించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను, జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఉద్దండరాయినిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ప్రజాప్రతినిధులు అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు, సెక్రటేరియట్ కాంప్లెక్స్, అంబేద్కర్ స్మృతివనం ప్రాంతాలను సందర్శించారు. ఎటుచూసినా కళావిహీనంగా మారిపోయిన ప్రాంతాన్ని చూసి ఆవేదన చెందారు. గత ప్రభుత్వం 10వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడితే వాటన్నింటినీ జగన్ ప్రభుత్వం పాడుపెట్టిందని దుయ్యబట్టారు. సీఎం చేసిన విధ్వంసం కారణంగా లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో అమరావతిని నాశనం చేయాలని జగన్ కుట్ర పన్నారని… వాటిని సాగనీయబోమన్నారు.