Peddireddy Ramachandra Reddy Slams CM Chandrababu: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష్య సాధింపు చర్యలు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుందని, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తీరని మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు.
తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ ఏవిధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో ఎయిర్‌పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడు అని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆనాడు మేనేజర్‌ను చంద్రబాబు అడ్డం పెట్టుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగి అరెస్ట్ చేయించారు. ఆ కేసు నిలబడలేదు. ఇప్పుడు అదే విధంగా ఈ కేసు ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మిథున్ రెడ్డిపై కక్ష్య సాధిస్తోంది. మాపై ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఇప్పటి వరకు మాపై ఏమి లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారని వేధింపులకు గురిచేస్తున్నారు. మూడు సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్నాడని తప్పుడు కేసు పెట్టారు. ఇది కూడా ఖచ్చితంగా తప్పుడు కేసుగా తేలుతుంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో తీరని మచ్చగా మిగులుతుంది’ అని అన్నారు.
Also Read: MLA Raja Singh: రాజీనామా చేయ్యమంటే చేస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!
‘ప్రభుత్వమే విద్వేష పూరితంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మామీద ఉన్న కక్ష్య, విద్వేషం కారణంగా కేసులు పెట్టారు. మేము తప్పు చేయలేదు. కడిగిన ముత్యంగా మిథున్ రెడ్డి బయటకు వస్తాడు. మీ దుర్మార్గాలను ప్రజలు చూస్తున్నారు. వారే సమాధానం చెప్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. తల్లికి వందనంకు 13 వేల కోట్లు అవసరమైతే.. మూడువేల కోట్లు తల్లికి వందనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రజలు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు.. తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రజలు దృష్టి మరల్చుతున్నారు’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.