భారీ మ్యాచులంటే తనకు చాలా ఇష్టం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్‌గా ఉండటం వెనుక కారణం ఏమీ లేదని చెప్పాడు. నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని తన జట్టు సహచరులకు ఎప్పుడూ చెబుతుంటా అని పేరొకొన్నాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్లో పంజాబ్ ఢీ కొట్టనుంది. క్వాలిఫయర్-2లో పంజాబ్ సారథి శ్రేయస్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం గురించి నిజం చెప్పాలంటే.. నాకు కూడా తెలియదు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్‌గా ఉండటం వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఇలాంటి భారీ మ్యాచులు అంటే నాకు చాలా ఇష్టం. నా సహచరులకు ఎప్పుడూ ఒకటి మాత్రం చెబుతా. పెద్ద పెద్ద మ్యాచులలో నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుంది. ఈరోజు మేం అదే చేశాం. ఈ మ్యాచ్ ఫలితమే ప్రత్యక్ష ఉదాహరణ. 200 ప్లస్ ఛేదనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. తొలి బంతి నుంచే మన ఉద్దేశ్యాన్ని చూపించాలి, విజయం సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రారంభాన్ని ముంబై సద్వినియోగం చేసుకోలేకపోయిందని నేను అనుకుంటున్నా’ అని చెప్పాడు.
‘నేను క్రీజ్‌లో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా. ఇతర బ్యాటర్లు వేగంగా ఆడి పరుగులు రాబట్టారు. నేను మైదానంలో ఎంత ఎక్కువ సమయం గడుపుతానో అంతగా బ్యాటింగ్‌లో మెరుగవుతాయి. నా దృష్టి, ఆలోచన కూడా మెరుగుపడుతుంది. మేం తొలి క్వాలిఫయర్‌లో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురయ్యాం. అయితే అదంతా అక్కడితోనే మరిచిపోయాం. మేము ఎక్కడ తప్పు చేశామో ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే సీజన్ అంతటా మేము అద్భుతంగా ఆడాం. కేవలం ఒక్క మ్యాచ్‌తోనే మా జట్టు ఏంటనేది నిర్వచించలేం. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ప్లేయర్స్ ఆలోచనలను కూడా నేను పరిగణలోకి తీసుకుంటా. కొందరికి పెద్దగా అనుభవం లేకపోయినా.. ధైర్యంగా ఆడుతున్నారు. ఐపీఎల్ 2025 వేలం సమయంలో ఎక్కువగా ఆలోచించ లేదు. నేను మంచి వాతావరణంలో ఉండాలనుకున్నా. నేను ఏ జట్టుకు వెళ్తున్నానో అనే దానికంటే.. నా మైండ్ స్పేస్ ముఖ్యం. నేను మేనేజ్మెంట్తో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. ప్లేయర్స్ కూడా కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఇప్పుడు మేం ఫైనల్‌కు వెళ్లాం. నేను ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి జట్టుతో సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నా. కానీ నేను వ్యక్తిగతంగా సగం పనే పూర్తయిందని భావిస్తున్నా. ఫైనల్ గురించి పెద్దగా ఆలోచించను. విశ్రాంతి తీసుకుని ఫైనల్‌కు సిద్దమవుతాం’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.