Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లకు డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను ఆమోదించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఆర్బీఐ బుధవారం ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై సమగ్ర సిస్టమ్ ఆడిట్, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మరింత కఠినమైన చర్యలు అవసరమని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: PM Modi: బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!
ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ పరికరాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్‌బ్యాక్ లేదా రీఫండ్ కాకుండా ఎలాంటి డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీ లేదా టాప్ అప్ అనుమతించబడదని ఆర్బీఐ తెలియజేసింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ మొదలైన వాటితో సహా తమ ఖాతాల నుంచి బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి తమ ఖాతాదారులు అనుమతించబడతారని, కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆర్బీఐ తెలిపింది. వడ్డీ, క్యాష్‌బ్యాక్, రీఫండ్లను ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022లో కూడా పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.