Tholi Prema Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో న్యూ ఇయర్ గిఫ్ట్ లభించనుంది. ఇప్పటికే 2023 కానుకగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖుషి’ డిసెంబర్ చివరిరోజున జనాన్ని పలకరించింది. ‘ఖుషి’ చిత్రాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. కొన్ని కేంద్రాలలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్థాయిలో ‘ఖుషి’కి జనం వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ ను ‘యూత్ ఐకాన్’గా నిలిపిన ‘తొలిప్రేమ’ చిత్రం 2023 ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా విడుదల కానుందని తెలిస్తే అభిమానులకు పండగే కదా! అందుకే 2023లో పవన్ ఫ్యాన్స్ కు ప్రేమికుల రోజున పవన్ ‘తొలిప్రేమ’ రూపంలో మరో కానుక అందబోతోందని అంటున్నారు సినీజనం.
NBK108: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ.కరుణాకరన్ ను దర్శకునిగా పరిచయంచేస్తూ జి.వి.జి.రాజు నిర్మించిన ‘తొలిప్రేమ’ చిత్రం 1998 జూలై 24న విడుదలయింది. అంటే 2023 ‘తొలిప్రేమ’కు రజతోత్సవ సంవత్సరం. ఈ నేపథ్యంలోనే ‘తొలిప్రేమ’ను మరోమారు జనం ముందు నిలిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిగా ‘తొలిప్రేమ’ పాతికేళ్ళు పూర్తి చేసుకొనే రోజున కాకుండా ఓ నాలుగు నెలలు ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్ లో ద్విశతదినోత్సవం జరుపుకున్న ‘తొలిప్రేమ’ యువతను విశేషంగా అలరించింది. పాతికేళ్ళ తరువాత నవతరం ప్రేక్షకులను సైతం అదే తీరున ‘తొలిప్రేమ’ మురిపించనుందని సినీజనం భావిస్తున్నారు. మరి ఈ సారి ‘తొలిప్రేమ’ ఏ రీతిన జనం మదిని తడుతుందో చూడాలి.