సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరి కోసం మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్ధితుల్లో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమం డిజైన్ చేసారు. ఈ కార్యక్రమంలో సమస్యలకు దాదాపు అక్కడే పరిష్కారం దొరికేలా చేస్తారు. రేపు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలసలో మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యుటీ సీఎం పవన్ పాల్గొంటారు.
Also Read: Nara Lokesh: కార్యకర్తల బాధ్యత నాది, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటా!
రావివలస గ్రామంలో స్క్రీన్ ఏర్పాటు చేసి వారితో మాట్లాడాలని ముందుగా అనుకున్నా.. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాల కారణంగా టెక్కలిలోని భవానీ థియేటర్‌ను వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరిలో తన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా గ్రామస్థులతో మాట్లాడతారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొననున్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలపై జనసేనాని ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.