అమరావతిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. రిజర్వేషన్ల సర్టిఫికెట్లను పొందే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవనుకు వివరించారు తూర్పు కాపు నేతలు. అయితే.. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు సర్టిఫికెట్లు అందచేసేందుకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్న తూర్పు కాపు నేతలు పవన్‌కు తెలిపారు. తూర్పు కాపుల జనాభా లెక్కను తగ్గించి చూపుతున్నారంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం 26 లక్షల మందిని తూర్పు కాపులుగా గుర్తిస్తే.. వైసీపీ కేవలం 16 లక్షలే అంటోందన్నారు. కావాలనే తూర్పు కాపుల జనాభాను తక్కువగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. బీసీల్లో నాయకత్వం పెరగకుంటే.. కొద్ది మంది ఉన్న వ్యక్తుల సమూహానికి లొంగాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా.. ‘తూర్పు కాపుల సమస్యలని ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన జిల్లాల్లోని తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఎందుకివ్వడం లేదో సీఎం జగన్ లేదా.. డీఫ్యాక్టో సీఎం సజ్జలే చెప్పాలి. ఈ నిబంధన కేవలం తూర్పు కాపులకే ఎందుకు అమలు చేస్తున్నారు..? సీఎం జగనుకేం తెలీదు.. అఙానంలో ఉంటారు.
Also Read :Ind vs Nz 2nd odi: ఆటకు అడ్డంకిగా మారిన వరుణుడు.. కొనసాగడం కష్టమే!
నేను ఉద్దానం వెళ్లలేదన్న మహానుభావుడు సీఎం జగన్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోండి. మీ సమస్యల పరిష్కారానికి జనసేన నిలబడుతుందని నమ్మితే జనసేన పార్టీకి ఓటు వేయండి. సమస్యలపై నిలబడే సత్తా ఉండే నాయకులను నిలబెట్టండి. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్దిమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒక మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తూర్పుకాపుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మీ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కూడా మీ సమస్యలను అధినాయకత్వానికి చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదు. ఆయన పరిస్థితే అలా ఉంటే ఇక మీ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోండి. తెలంగాణలో పర్యటించినప్పుడు బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. నేను వాళ్లలా తేనే పూసిన కత్తిని కాదు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయను. ఒక్క సినిమాను ఆపడానికి వాళ్లు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించినప్పుడు.. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిపికేట్ ఇవ్వడానికి మనం ఎందుకు యంత్రాగాన్ని వాడకూడదు.. అధికారాన్ని వాళ్లు దుర్వినియోగం చేస్తే… మేము సద్వినియోగం చేస్తాం. బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్ శాసించేది వారే. రాజకీయ చైతన్యంతో… ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి మార్చండి. కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారు. కులంలో కొంతమంది చెంచాలు… కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాలి.’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.