ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో ‘కొణిదెల’ గ్రామం గురించి పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పవన్ వెంటనే కొణిదెల గ్రామానికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గ్రామ పరిస్థితి గురించి ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ వివరించారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు పవన్ హామీ ఇచ్చారు.
Also Read: YS Jagan: నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!
అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం జరిగింది. ఇటీవల ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామానికి ఫారం ఫాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు పవన్ వెళ్లారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని ఆ సభలో చెప్పారు. తన వ్యక్తిగత నిధుల నుంచి రూ.50 లక్షలు కొణిదెల గ్రామానికి ఇస్తానని ప్రకటించారు. గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భూమి పూజ చేయనున్నారు.