Deputy CM Pawan Kalyan: ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసమో, ఓట్ల కోసం మా ప్రభుత్వం పనిచేయదని.. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో మేం వున్నామని కచ్చితంగా చెబుతున్నామన్నారు. 19 పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుమ్మంతి పర్యటనలో గిరిజనుల సమస్యను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ‘డోలీ మోతల విముక్త ఏపీ’లో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు.
Read Also: Chennai: తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన డబ్బులతో రమ్మీ ఆడిన కొడుకు.. చివరికీ..
గిరిజన యువత తలుచుకుంటేనే మార్పు సాధ్యమని.. ప్రభుత్వం మారింది, పంచాయతీ సర్పంచ్‌లు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నామన్నారు. 100 మంది జనాభా ఉన్న గ్రామాలకు రోడ్లు నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ మహా సంకల్పమని వెల్లడించారు. ఏటా రూ. 350కోట్లు రహదారులు, ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని చెప్పారు. ప్రజల నమ్మకం గెలుచుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. ఐదేళ్ల పనితీరు గమనించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. తాను, ముఖ్యమంత్రి మనసు పెట్టకపోతే ఇవాళ ఏజెన్సీలో రోడ్లు లేవన్నారు. ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియదు.. ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడం వాటిని పరిష్కరించడం మాత్రం తెలుసన్నారు. జనవరిలో రూ.250కోట్లు రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వనుందని తెలిపారు. తిట్లు తిన్నాం.. కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినా భరించి నిలబడ్డాం.. దాని ఫలితం ఇవాళ ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం లభించిందన్నారు. గంజాయిని ఒక సామాజిక సమస్యగా చూడాలని పవన్ అన్నారు.
Read Also: RGV: రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు
గంజాయి గిరిజన ఆచార వ్యవహారాలు దాటి కమర్షియల్ అయిందన్నారు. యువత, పిల్లలు చెడిపోవడానానికి గంజాయి కారణమంటూ వ్యాఖ్యానించారు. మత్తులో ఇటీవల కడపలో టీచర్‌పై దాడి చేసి కొందరు విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గంజాయి సాగు వదిలేయమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గంజాయి గ్రామాలను దాటి ఎక్స్‌పోర్ట్ వరకు వెళ్లడంతో ఏపీ గంజాయి కేపిటల్‌గా మారిందని మండిపడ్డారు. గంజాయిని మీరు వదిలే వరకు మిమ్మల్ని వదలనన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తనకు గిరిజన ఆచార వ్యవహారాలు చాలా ఇష్టమని పేర్కొన్నారు. మీ ఇంట్లో ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడనీ గుర్తు పెట్టుకోవాలన్న ఆయన.. మంచి పని చేసే వాడికి ఆపద ఉండదు.. ఉండకూడదు.. దీనిని తాను బలంగా నమ్ముతానన్నారు. సినిమా కోసం తాను ఎప్పుడూ కల కనలేదని.. దేశం కోసం, ప్రజల కోసం కల కన్నానన్నారు. మనసు, బుద్ధి కలిస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి రావాలని.. విదేశాలలో ఉండే చాలా సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఇటువంటి చోట షూటింగ్‌లు చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.