సినీ గ్లామర్ ప్రపంచంలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక తీరని మచ్చలా కొనసాగుతోంది. ఎంతోమంది హీరోయిన్లు, నటీమణులు కెరీర్ కోసం తాము పడ్డ ఇబ్బందులను ఇప్పటికే ధైర్యంగా బయటపెట్టారు. అయితే, అసలు సిసలు దారుణం ఏమిటంటే.. చాలామంది నటీమణులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే, అంటే తమ చిన్నతనం లోనే భయానకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తుల కంటే కూడా సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాణస్నేహితులు అని నమ్మిన వారి చేతుల్లోనే లైంగిక వేధింపులకు గురయ్యామని వారు చెబుతున్న నిజాలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. తాజాగా స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోతు పంచుకున్న తన జీవిత అనుభవాలు ఈ చీకటి కోణాన్ని మరోసారి సమాజం ముందుకు తెచ్చాయి.
Also Read : MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పార్వతి తిరువోతు, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో జరిగిన దారుణ ఘటనలను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఏ విషయం ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే పార్వతి.. తాను చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు, ఒక ఆగంతకుడు వచ్చి తన ఛాతీపై బలంగా కొట్టి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని, అప్పటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మగాళ్ల చూపుల నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలో తన తల్లి నేర్పించాల్సి వచ్చిందని బాధపడ్డారు.
పెరిగి పెద్దయ్యాక కూడా వేధింపులు తనను నీడలా వెంటాడాయని ఆమె తెలిపారు. స్కూల్ రోజుల్లో తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, ఒక రోజు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చమని వేధించాడని గుర్తు చేసుకున్నారు. “ప్రేమిస్తే మాత్రం అమ్మాయి అంగీకారం లేకుండా అలాంటి పనులకు ఒప్పుకోవాలా?” అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు, ఒకసారి లిఫ్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన ఘటనను కూడా ఆమె వివరించారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమాపై కూడా గతంలో నిర్మొహమాటంగా విమర్శలు చేసిన పార్వతి, ఇండస్ట్రీలో నిజాలు మాట్లాడితే ‘మతిస్థిమితం లేదు’ అని ముద్ర వేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.