షెడ్యూల్డ్ తెగలకు చెందిన నకిలీ పత్రాలతో (Fake Caste Certificates) లబ్ధి పొందే అనర్హులపై చర్యలు తీసుకునేలా పార్లమెంటరీ కమిటీ (Parliamentary Panel) కేంద్రానికి సూచించింది. శిక్షార్హమైన నేరంగా పరిగణించే బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరింది. అలాగే కుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు కాలపరిమితిని నిర్ణయించేలా బిల్లులో ప్రవేశపెట్టాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
కుల ధృవీకరణ పత్రం వెరిఫికేషన్‌కు సంబంధించి మంత్రిత్వ శాఖలు మరియు వివిధ శాఖల క్రింద రిజర్వేషన్ విధానం అమలుపై పార్లమెంట్ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కుల ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో జాప్యం చేసినందుకు పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు నిలిపివేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఉద్యోగంలో చేరిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు సమర్పించడానికి నిర్ణీత సమయాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. సరైన సమయంలో కుల ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో ఆలస్యం చేసినందుకు లేదా సమర్పించనందుకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదా పెన్షన్ నిలిపివేసినట్లు కమిటీ పేర్కొంది. కుల ధృవీకరణ పత్రం విషయంలో గానీ… సర్టిఫికెట్ సమర్పించడంలో గానీ ఒక నిర్ణీత సమాయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి పార్లమెంట్ కమిటీ సూచించింది.
చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అర్హులు కాకుండా అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లపై చర్యలు తీసుకోవాలని కమిటీ కేంద్రానికి ప్రతిపాదించింది. కమిటీ సిఫార్సులపై కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.