దక్షిణ కొరియాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్‌లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 46 స్థానాలకు పోలైన ఓట్ల నిష్పత్తి ప్రకారం కేటాయించబడుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బర్త్‌డే పార్టీలో మత్తులో జోగిన యువకులు
ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud : కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి