Parliament Budget Session : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు రోజు అంటే 31న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పూర్తి అజెండా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి చేరినట్లు తెలుస్తున్నది. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి.
Read Also: Brazil President: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్లా
సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తొలి విడతలో సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై జరిగే చర్చలకు ఆర్థిక మంత్రి సమాధానం సమాధానం ఇవ్వనున్నారు. రెండో విడుత సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తదితర అంశాలపై చర్చించనున్నారు.