వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్ని్కల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
హిందూపురం నుంచి స్వామీజీగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు.. ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఇప్పటికే హిందూపురంలో జాబ్ మేళా ఏర్పాటు చేశానని.. 7 వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పరిపూర్ణానంద స్వామి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే శనివారం బీజేపీ అధిష్టానం తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 195 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తెలంగాణలో మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచనతోనే అభ్యర్థుల్ని ప్రకటించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయవాడ వేదికగా బీజేపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ నుంచి శివప్రకాశ్ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.