పంచాయతీ ఎన్నికలు అక్కడ మిత్రుల మధ్య కొత్త పంచాయితీ పెట్టాయా? ఎక్కడైనా బావేగానీ వంగతోట కాడ కాదన్నట్టుగా ఎవరికి పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారా? స్టేట్ పాలిటిక్స్ వేరు, లోకల్ లెక్కలు వేరన్నట్టుగా… ఎక్కడి రాజకీయం నడుస్తోంది? ఏయే పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది?
Also Read:Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బలపడ్డ బంధం ఇప్పటికీ అలాగే ఉందన్నది వోవరాల్ టాక్. కానీ… పంచాయతీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఉందట వ్యవహారం. పార్టీలు బలపడాలన్నా…. నిలబడాలన్నా…. గ్రామ పంచాయతీల్లో పట్టు బిగించడం చాలా ముఖ్యం కాబట్టి… ఆ పొత్తు ఇక్కడ వర్కౌట్ అవ్వదు బాబూ అని రెండు పార్టీల నాయకులు అంటున్నట్టు తెలుస్తోంది. అందునా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలో దోస్తుల మధ్య పంచాయతీ ఎన్నికల పంచాయితీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రెండు పార్టీల నాయకులు ఎవరికి వారే నామినేషన్స్ వేశారు. ఎమ్మెల్యే కూనంనేని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ… తన నియోజకవర్గం పరిధిలో ఎక్కువ గ్రామాలను గెల్చుకోవాలన్న పట్టుదలగా ఉన్నారట.
అయితే… ఇక్కడ కాంగ్రెస్‌ను నడిపిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా… బాధ్యత అంతా తన వియ్యంకుడు, ఎంపీ రఘురామి రెడ్డికి అప్పగించినట్టు తెలిసింది. దాంతో రఘురామిరెడ్డి కాలికి బలపం కట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ…బీఆర్ఎస్ శ్రేణుల్ని కూడా తమ వైపు తిప్పుకునే ప్లాన్‌లో ఉన్నారు. అదే సమయంలో సీపీఐ మీద కూడా పైచేయి సాధించే ప్రయత్నం చేయడం రాజకీయంగా రక్తి కట్టిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త చర్చ కూడా మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ సంబంధాలు ఎలా ఉన్నా…. కొత్తగూడెం ప్రాంతంలో మాత్రం బాగా గ్యాప్ ఉందని చెప్పుకుంటున్నారు. అయితే… సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న పలుకుబడితో ఎమ్మెల్యే కూనంనేని నిధులు సాధిస్తున్నారని, సీఎం కూడా కూనంనేనికి ప్రాధాన్యత ఇస్తున్నారుగానీ… గ్రౌండ్ లెవల్‌లో మాత్రం రెండు పార్టీల కేడర్ మధ్య అంత సఖ్యత లేదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా బలమైన వర్గం ఉంది.
కొత్తగూడెంలో ఆయన క్యాంపు కార్యాలయం కూడా పెట్టుకున్నారు. ఈ పరిణామక్రమంలో రెండు పార్టీల సఖ్యత అంతంతమాత్రంగానే ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. మిగతా చోట్ల సీపీఐ, కాంగ్రెస్ కలిసి బీఆర్‌ఎస్ మీద పోరాటం చేస్తుంటే… కొత్తగూడెంలో మాత్రం సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంది. నియోజకవర్గంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మిదేవి పల్లి, పాల్వంచ రూరల్ మండలాలు ఉండగా… పాల్వంచ రూరల్ లో మాత్రమే కాంగ్రెస్ బలం నిరూపించుకోగలిగింది. మిగిలిన మండలాలు, మున్సిపాలిటీలో మాత్రం మూడో ప్లేస్‌కు పరిమితం అయింది. ఈ పరిస్థితుల్లో… ప్రస్తుతం అదికారంలో ఉన్నందున కాంగ్రెస్ నాయకులు చేస్తున్న గట్టి ప్రయత్నాలతో బీఆర్ఎస్ కేడర్ లోపాయి కారిగా హస్తం పార్టీకి పని చేస్తోందట. అంతే కాకుండా ఎంపీ రఘురామిరెడ్డి కొత్తగూడెంలోనే మకాం వేసి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారట.
Also Read:Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచుతున్న వైనం.. ఇద్దరి అరెస్ట్
కానీ… సీపీఐ స్థానిక నాయకులు మాత్రం దీన్ని తట్టుకోలేకపోతున్నారట. ఇక్కడ తమకే బలం ఉందని, అందువల్ల తామే నియోజకవర్గంలో ఆధిపత్య పార్టీగా ఉంటామని చెబుతున్నారు. మరోసారి సత్తా చూపించేందుకు లెఫ్ట్ పార్టీ సీరియస్‌గా ఉన్న క్రమంలో మిత్ర భేదాలు తలెత్తుతాయా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు పట్టు వదిలితే… రేపు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేయడం కష్టమవుతుందన్న ఆలోచన ఎమ్మెల్యేకి ఉందట.దానికి అనుగుణంగా ఆయన పావులు కదుపుతుంటే.. సిపిఐని ఎలాగైనా దెబ్బ తీయాలని కాంగ్రెస్ నాయకులు వర్కౌట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ఆధిపత్యపోరులో చివరికి ఎవరికి పైచేయి అవుతుందో చూడాలి.