తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగయగా.. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి స్తాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్లను వేరు వేరు చేయనున్నారు. సిబ్బంది బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేసి 25గా కట్టలు కట్టనున్నారు. అనంతరం అధికారులు కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగనుంది. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. ఈనెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.