Pakistan: పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్‌లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నుంచి ముప్పు ఉందని పీటీఐ ఆరోపించిన ‘దౌత్యపరమైన కేబుల్ సాగా – సైఫర్’ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఖురేషీని ఇస్లామాబాద్ నివాసం నుండి కస్టడీలోకి తీసుకుంది. గతేడాది ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2022 మార్చి నెలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒక లేఖని చూపిస్తూ.. అమెరికా మద్దతుతో తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ పన్నుతున్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, ఇమ్రాన్‌పై తారాస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఆయన్ను తర్వాతి నెలలో, అంటే 2022 ఏప్రిల్‌లో కార్యాలయం నుంచి తొలగించారు.
Read Also: Hyderabad Crime: భార్యతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసేందుకు కుట్ర.. పెళ్లి వేడుకలో విష ప్రయోగం
“పీటీఐ ఉపాధ్యక్షుడు షా మెహమూద్ ఖురేషీని మరోసారి అక్రమంగా అరెస్టు చేశారు’’ అని పార్టీ ఖాతాలో సోషల్ మీడియా పోస్ట్ చేసింది. భారీ పోలీసు బలగాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని ఇంటి నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. పీటీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమర్ అయూబ్ ఖాన్ కూడా ఖురేషీ అరెస్ట్ వార్తను ట్విటర్‌లో పంచుకున్నారు. విలేకరుల సమావేశం అనంతరం ఇంటికి చేరుకున్న ఖురేషీని అదుపులోకి తీసుకున్నట్లు అయూబ్ తెలిపారు. “పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వైస్ ప్రెసిడెంట్ మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషీని ఇస్లామాబాద్‌లోని ఆయన ఇంటి నుండి 25 నిమిషాల క్రితం అరెస్టు చేశారు. ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఇంటికి చేరుకున్నాడు” అని మర్ అయూబ్ ఖాన్ చెప్పారు.
తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయి మూడేళ్ల జైలు శిక్ష పడిన కొద్ది రోజులకే ఖురేషీ అరెస్ట్ కావడం గమనార్హం. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ పోలీసులు కోర్టు తీర్పు తర్వాత పంజాబ్ పోలీసుల సమన్వయంతో లాహోర్‌లోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. ఆయనను లాహోర్ నుంచి ఇస్లామాబాద్ పంపించారు.