Babar Azam Past Hashim Amla And Virat Kohli: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. తాజాగా బాబర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (53) చేయడంతో ఈ రికార్డును అందుకున్నాడు.
బాబర్ ఆజమ్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో ఇప్పటివరకు 5,142 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హసీం ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 4,946 పరుగులు చేశాడు. ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో బాబర్ 53 పరుగులు చేసి ఆమ్లా రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4,607), విండీస్ కెప్టెన్ షై హోప్ (4,436), ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (4,428) టాప్-5లో కొనసాగుతున్నారు.
Also Read: Student Died: క్లాస్ రూమ్‌లో తేలు కాటు.. రక్తపు వాంతులు చేసుకుని విద్యార్థి మృతి!
ఈ అరుదైన రికార్డు రికార్డుల రారాజు, బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీతో కూడా సాధ్యం కాలేదు. విరాట్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 4,230 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ తొమ్మిదో స్ధానంలో ఉన్నాడు. భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్‌లో తన మొదటి 100 ఇన్నింగ్స్‌లలో 4,343 పరుగులతో ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 13 సెంచరీలు చేయగా.. బాబర్ ఆజమ్ 18 శతకాలు బాదాడు. బాబర్ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 18 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.