ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే అవకాశాలు తెరపైకి వస్తున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ నిరంతరం దాడులు..
ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా సోమవారం పాకిస్థాన్.. 8 మందిని ఆఫ్ఘనిస్తాన్ పౌరులను చంపినట్లు తెలుస్తోంది. మరో13 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. శనివారం కూడా, పాక్టియాలోని మసీదుపై పాకిస్థాన్ మోర్టార్ కాల్పులు జరిపింది. ఇందులో 3 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు అంతర్జాతీయ నాయకులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ నిరంతరం తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు వైపుల నుంచి హింసాత్మక ఘర్షణలు..
టోలో న్యూస్ నివేదిక ప్రకారం.. డ్యూరాండ్ లైన్‌లో రెండు వైపుల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రెండు పోస్టులను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. భారీ ఆయుధాలను ఉపయోగించి, తాలిబాన్ సైనికులు డ్యూరాండ్ లైన్‌లో ఉన్న పాకిస్థానీ సైన్యం యొక్క అనేక పోస్టులను తగలబెట్టారు. 19 మంది పాక్ ఆర్మీ సైనికులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు. గోజ్‌గర్హి, మాతా సంగర్, కోట్ రాఘా, తారీ మెంగల్ ప్రాంతాల్లోకి తాలిబన్ ఫైటర్లు ప్రవేశించి భారీగా కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు ఖుర్రం, ఉత్తర వజీరిస్థాన్‌లలో చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్ సైన్యం తెలిపింది.
డురాండ్ రేఖను దాటి..
ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు డురాండ్ రేఖను దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించి పాక్ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. పోస్టులపై గుండ్లు పేలుస్తున్నారు. వాస్తవానికి.. ఆఫ్ఘనిస్తాన్ -పాకిస్థాన్ మధ్య 2640 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు పేరు డ్యూరాండ్ లైన్. ఈ రేఖ పష్టూన్ గిరిజన ప్రాంతం, దక్షిణాన బలూచిస్తాన్ గుండా వెళుతుంది. ఇది పష్తూన్‌లు , బలూచ్‌లను రెండు దేశాలుగా విభజిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుగా కూడా పరిగణించారు.