భారతీయ సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ను ప్రకటించన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ.. తమ కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. అయితే, ఈ గౌరవాన్ని అందుకోవడానికి ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు. అభిమానులు, సినీ పెద్దలంతా ఆయన గురించి మాట్లాడుకుంటుంటే మా మనసు నిండిపోతోంది’’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read : NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ లేటెస్ట్ అప్డేట్!
‘ధర్మేంద్ర తన కెరీర్లో ఎప్పుడూ అవార్డుల కోసం పాకులాడలేదు, కేవలం తన పాత్రకు న్యాయం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు’ అని హేమమాలిని గుర్తుచేసుకున్నారు. ‘ఆయనకు ఎన్నో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి కానీ, ఒక్క ఫిల్మ్‌ఫేర్ కూడా రాలేదు. ఇప్పుడు ఇంత పెద్ద పురస్కారం దక్కిన వేళ ఆయన లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇదే బాధలో ఉన్నారు’ అని ఆమె అన్నారు. ధర్మేంద్రకు ఈ గౌరవం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి హేమమాలిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే దిగ్గజ నటుడు లేకపోయినా, ఆయన రూపంలో దక్కిన ఈ పురస్కారం ఆయన కీర్తిని చిరస్థాయిగా ఉంచుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.