CM Revanth Reddy : పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డిని సన్మానించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్‌గా అరుదైన గౌరవాన్ని పొందిన వ్యక్తిగా నాగేశ్వర రెడ్డిని అభివర్ణించారు. “నాగేశ్వర రెడ్డి గారు భారతదేశానికి అపార సేవలు అందించారు. ఆయన ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, మరియు తాజాగా పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. నిజానికి, ఆయన భారత రత్నకు కూడా అర్హుడు.”
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. ఇది కేవలం రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు దోహదం చేస్తుంది. తెలంగాణను ఒక హెల్త్ హబ్‌గా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షల వరకు పెంచి, మరింత మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాం.”
“గతంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. కానీ ఇప్పటి తరంలో ఆ విధానం కనుమరుగైంది. మేము మళ్లీ అదే విధానాన్ని తెస్తున్నాం. కుటుంబ సభ్యుడిలా ధైర్యాన్ని నింపే వైద్యుల అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ కలిగిన ప్రత్యేకమైన కార్డులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.” అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో డేటా అత్యంత విలువైన ఆస్తిగా మారబోతోంది. వైద్య సేవలకు సంబంధించి మరింత విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాం. వెయ్యి ఎకరాల్లో, ఎయిర్ పోర్టు సమీపంలో, తెలంగాణలో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇది వైద్య సేవలకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. తెలంగాణను హెల్త్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి వంటి వైద్య నిపుణుల సహకారం అత్యంత కీలకం. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా