కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుపై అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. జమ్మికుంట గడ్డపై మళ్లీ గులాభి జెండా ఎగురవేశామని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇకనైన మారి బుద్ది తెచ్చుకోవాలని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 200యూనిట్స్ వరకు కరెంట్ బిల్లులు కట్టద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పేరును చెరిపివేయాలని చూస్తుందని ఆయన పేర్కొన్నారు. చెరిపి వేయడానికి కేసీఆర్ పేరు గోడలపై లేదు, ప్రజల గుండెల్లో ఉన్నదనే విషయం మరిచిపోవద్దని ఆయన అన్నారు. రుణమాఫీ చేయాలని అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి హోదాలో ఉండి కోమటిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉంటే.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గురువారం జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో పత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై విజయం సాధించారు. అయితే, ఎన్నికల ప్రచారం చివరి దశలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తాజాగా సీరియస్ అయ్యారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని, అలాకాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు.