Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దీని వెనుక అసలు కథ వేరే ఉంది.. లారీ కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం తరలింపునకు వినియోగించాల్సిన లారీలను నల్ల మట్టి, ఇసుక వంటి ఇతర వ్యాపారాలకు మళ్లిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు.
ఒక్కో గింజను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. సమయానికి ధాన్యం తరలింపు జరగకపోవడంతో నాణ్యత తగ్గిపోతోంది. మరోవైపు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసిన రైతులు వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది బాగానే ఉంది. కానీ, ధాన్యం తరలింపునకు సరైన వ్యవస్థ లేకపోతే ఈ కేంద్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి..? లారీ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే, రైతుల కష్టాలు ఇలాగే కొనసాగుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే లారీలను అందుబాటులోకి తెచ్చి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే, పండించిన పంట కళ్లెదుటే మట్టిపాలై, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ రైతుల ఆర్తనాదాలు ఉన్నతాధికారులకు వినిపిస్తాయా..? వేచి చూడాలి..!
Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం