ఆప్ఘనిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలతో ప్రజలు కకావికలం అయ్యారు. ఒక్కసారిగా ఉప్పెనలా రావడంతో జనాలు పెద్ద ఎత్తున మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు వరదల కారణంగా 300 మంది మృతిచెందినట్లు వార్తలు అందుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హఠాత్తుగా వచ్చిన వరదలు కారణంగా ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. పైగా పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. సహాయ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఒక్క ప్రావిన్స్‌లోనే వందలాది మంది మరణించారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. ఇక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వరదలు కారణంగా ఇళ్లు, వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోగా.. వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారులు, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. దీంతో జనాలు సంచరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాలు, పొలాలు, నదులు పొంగిపొర్లాయి. బగ్లానీ జాడిద్‌లో 1,500 వరకు గృహాలు దెబ్బతిన్నాయి.
ఇక రోడ్లపై మృతదేహాలు పడి ఉన్నాయి. బురదలో కప్పబడ్డాయి. ఇంకోవైపు పిల్లల ఏడుస్తూ వీడియోల్లో కనిపించారు. ఇదిలా ఉంటే శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ వరదలు కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తాలిబన్ అధికారులు భావిస్తున్నారు.