No Confidence Motion: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మణిపూర్ అంశంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ నోటీసు సమర్పించారు. ఈ అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నోటీసు ఇచ్చారు. మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అవిశ్వాసం పెట్టడం ద్వారా ప్రధాని స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇతర అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) భావిస్తోంది.
Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్‌మెంట్ లెటర్.. జీతం ఎంతో తెలుసా?
అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం మెజారిటీని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదం పొందినట్లయితే, ప్రభుత్వం రాజీనామా చేయాలి. తీర్మానం జాబితా చేయబడిన తర్వాత, లోక్‌సభ స్పీకర్ దానిని సభ లోపల ప్రకటిస్తారు. అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. సభలో తీర్మానం ఆమోదం పొందితే, అవిశ్వాస తీర్మానంపై చర్చతోపాటు ఓటింగ్ తేదీని స్పీకర్ ప్రకటిస్తారు. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో ఎన్డీయేకు 330 మందికి పైగా సభ్యులు ఉండగా, మెజారిటీ మార్క్ 272. కాగా ‘ఇండియా’లో చేరి ఉన్న పార్టీలకు దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలకు 60 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. వారు ఈ రెండు శిబిరాల వెలుపల ఉన్నారు.