ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేసినట్టేనా? ప్రభుత్వ అణచివేత అన్నది కేవలం సాకు మాత్రమేనా? అసలు సంగతి వేరే ఉందా? వామపక్షాల అభ్యర్థులు సైతం బరిలో ఉన్నా… అంతకు మించి వందల రెట్ల బలం ఉన్న వైసీపీ ఎందుకు తప్పుకుంటున్నట్టు ప్రకటించింది? ఏ విషయంలో గోదావరి జిల్లాల వైసీపీ లీడర్స్ భయపడ్డారు? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల్ని నిలపకూడదని నిర్ణయించింది వైసీపీ. అందుకు ఆ పార్టీ పైకి చెబుతున్న కారణాలెలా ఉన్నా… అంతర్గతంగా అసలు మేటర్ వేరే ఉందట. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని అణచి వేస్తోందని, వేధిస్తోందని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని చెబుతున్నా… పార్టీ వర్గాలు పోటీకి సిద్ధంగా లేకపోవడమే అసలు కారణమన్నది ఇంటర్నల్ టాక్ అట. పార్టీ నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు, కో ఆర్డినేటర్లు ఎవరూ ఇప్పుడే ఎన్నికల భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్ది రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈనెల 18న నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుంది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పదవీకాలం వచ్చే మార్చితో ముగుస్తుంది. దీంతో ఆ సీటుకు కూడా సాధారణ ఎన్నిక జరుగుతోంది. ఈ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోనే జరుగుతాయి. ఇప్పటికే పట్టభద్రులకు సంబంధించి కూటమి తరపున టిడిపి నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన ఆల్రెడీ ప్రచారం కూడా మొదలెట్టేశారు. అలాగే కూటమి పార్టీలన్నీ పట్టభద్రుల ఓట్ల నమోదులో యాక్టివ్‌గా ఉన్నాయి. కానీ… వైసీపీ మాత్రం తామీ పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించేసింది. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పోలీసుల్ని ఉపయోగించుకుని తమ కార్యకర్తల్ని అణచివేస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నది వైసీపీ పెద్దల మాట. కానీ.. అది పై మాటేనని అసలు విషయం మాత్రం నాయకులు చేతులెత్తేయడమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది జిల్లాల్లో.
ఓడిపోయినంత మాత్రాన మరీ అంత నిర్లిప్తత ఎందుకు? రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజం కదా అంటే… మీకేం తెలుసు బాబూ…. మా కష్టాలు మావి అంటున్నారట వైసీపీ లీడర్స్. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో… వైసీపీ అభ్యర్థులకిస్తామన్న సొమ్మును సక్రమంగా ఇవ్వలేదట. రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ… ఫైనల్‌గా చేతులెత్తేశారని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. జగన్ పేరు చెబితే చాలు… జనం ఓట్లేస్తారంటూ పార్టీ ముఖ్య నాయకులు, కో ఆర్డినేటర్లు ఊదరగొట్టి ఇక డబ్బు ఎందుకన్నట్టుగా తమను భ్రమల్లో ముంచెత్తారని ఇప్పటికీ వాపోతున్నారట కొందరు అభ్యర్థులు. మరి కొందరు మాత్రం చివరి నిమిషంలో తప్పనిసరై సొంత సొమ్మును భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. ఆ క్రమంలో కోట్లలో అప్పుల పాలైన అభ్యర్థులు సైతం ఉన్నారన్నది లోకల్ టాక్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దింపినా… అధిష్టానం నుంచి ఆర్థిక సాయం అందబోదన్న నిర్ధారణకు ఉభయ జిల్లాల పార్టీ బాధ్యులు వచ్చినట్టు సమాచారం. అలాంటప్పుడు ఎవరు లీడ్ తీసుకుంటే… వాళ్ళ చేతి చమురే వదులుతుందని అనుకుంటూ… ఆ విషయాన్ని పైకి చెప్పకుండా… ప్రభుత్వం అణచివేస్తోందని సాకులు చెబుతున్నట్టు వైసీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే వామపక్షాల తరపున బరిలో దిగే అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. వామపక్షాలు కూడా బిజెపి భాగస్వామిగా ఉన్న కూటమి అభ్యర్థిని ఖచ్చితంగా ఓడించాలన్న పట్టుదలతో పని చేస్తాయని, పైగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండూ వారికి సిట్టింగ్ స్థానాలేనంటూ కొత్త లెక్కలు చెబుతున్నారట వైసీపీ లీడర్స్. అటు వామపక్షాలు కూడా వైసీపి మద్దతు ఇస్తే గెలుపు తేలిక అవుతుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలా… వాళ్ళు గెలిస్తే… తమ మద్దతు వల్లేనని చెప్పుకుంటూ ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ స్థానిక నాయకులు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.