మరిదిని అరెస్ట్ చేసి వదినమ్మని వదిలేశారా? లేక ఆయన ఇచ్చే సమాచారంతో నట్లు గట్టిగా బిగించాలన్న ప్లాన్ ఉందా? మాజీ మంత్రి విడదల రజనీ కేసులో ఏం జరుగుతోంది? కేసులో ఏ1గా ఉన్న రజనీ బయట తిరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… ఆమె జోలికి వెళ్ళకుండా ఏ3 అయిన ఆమె మరిదిని వెదికి మరీ ఎందుకు పట్టుకున్నారు? ఏ3 ఇచ్చే సమాచారంతో ఏ1ని గట్టిగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారా? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఏపీ మాజీ మంత్రి విడదల రజనీ పవర్‌లో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటనుంచి గెలిచి మంత్రి అయ్యారు విడదల. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక మాజీ మంత్రికి కష్టకాలం వచ్చిందని చెప్పుకుంటున్నా… గడిచిన పది నెలల్లో ఆ తరహా వాతావరణం కనిపించలేదు. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారుతున్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు పరిశీలకులు. వైసీపీ హయాంలో యడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2కోట్ల 20లక్షలు వసూలు చేశారని ఇంతకుముందే కేసు బుక్ అయింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం… మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా మీద కేసులు పెట్టింది ఏసీబీ. దీంతో హైకోర్ట్‌కు వెళ్ళారు రజనీ. కేసు దర్యాప్తునకు సహకరిస్తామని, ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కోరడంతో…ఆ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. అటు ఇదే కేసులో ఏ2గా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా కూడా పిటిషన్ దాఖలు చేసినా కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలోనే… తాజాగా… కేసులో ఏ3గా ఉన్న విడదల రజని మరిది గోపీని హైదరాబాదులో అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ అరెస్ట్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు రజనీకి ఇప్పటి వరకూ ఈ కేసులో ముందస్తు బెయిల్ రాలేదు. ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ నేతలతో జగన్ జరిపిన సమీక్షకు కూడా అటెండ్ అయ్యారు. అయితే… కేసులో ఏ1గా ఉన్న రజనీని వదిలేసి ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. అదే సమయంలో దీని వెనక పెద్ద వ్యూహం ఉండి ఉండవచ్చని కూడా చెప్పుకుంటున్నారు కొందరు. రజనీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక వ్యవహారాలతోపాటు అనేక సెటిల్మెంట్స్‌లో గోపీ పాత్ర ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయిందట. యడ్లపాడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలుచేసిన ఘటనలోకూడా గోపి కీలకంగా వ్యవహరించినట్టు విచారణలో తేలిందట. అలాగే చిలకలూరిపేటలో జరిగిన పలు వసూళ్ల వ్యవహారాల్లో కూడా గోపి కీ రోల్ పోషించినట్టు గుర్తించారట పోలీసులు. అందుకే ముందు ఆయన్ని అరెస్ట్ చేశారని, ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించి అక్కడ స్విచ్చేస్తే… ఇక్కడ బల్బు వెలుగుతుందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. గోపీని విచారిస్తే… రజనీకి సంబంధించిన చాలా వ్యవహారాలు బయటికి వస్తాయని చెప్పుకుంటున్నారు. అందుకే పోలీసులు వ్యూహాత్మకంగా ముందు వదినమ్మని కాకుండా మరిదిని అరెస్ట్ చేసినట్టు భావిస్తున్నారు. ఏసీబీ కేసు పెట్టాక గోపి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆయన కదలికలపై నిఘా పెట్టి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఆయన్ని పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటే… క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంతోపాటు మాజీ మంత్రికి సంబంధించిన చాలా విషయాలు బయటికి రావచ్చని అంటున్నారు. గోపీ నుంచి వివరాలు రాబట్టాక రజనీ మీద ఫోకస్ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి విచారణలో గోపి ఏం చెబుతారు? దాని ఆధారంగా వదినమ్మని వదిలేస్తారా? లేక ఫిక్స్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.