తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? జోడెద్దుల్లా నడిపించాల్సిన ఆ నాయకుడే నత్తనడకన ఉన్నారా? నిజంగా ఆయన పని చేయడం లేదా? లేక చేయనివ్వడం లేదా? అందివచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని వాడుకోలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ నాయకుడు ఎవరు? ఎందుకంత సంక్లిష్టతలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవడమంటే అంత ఈజీ కాదు, ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా ఈక్వేషన్స్ అండ్ కేలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ… తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్ విషయంలో అలాంటివన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవడంతోపాటు… పార్టీలో భిన్న ధృవాలుగా ఉండే నేతలంతా ఒక్క మాట మీదికి వచ్చి ఓకే చెప్పేశారు. కాంగ్రెస్ కల్చర్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా అరుదైన వ్యవహారం. అంతటి అవకాశం వచ్చినా… ఎందుకో, మహేష్‌గౌడ్ దాన్ని సక్రమంగా వాడుకోలేకపోతున్నారన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం కమిటీని వేసుకోలేకపోయారన్నది ఓపెన్ టాక్. కొత్త కమిటీ నిర్మాణం అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ.. ఆ విషయంలోనూ క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే… ఇప్పుడు పని మొదలుపెట్టినా… కసరత్తు పూర్తవడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో పార్టీకి కమిటీ లేక, యాక్టివ్ అవకపోవడంతో… ప్రభుత్వ నిర్ణయాలు ఏవీ….సరిగా ప్రజల్లోకి వెళ్ళడంలేదని, అదే పెద్ద మైనస్ అవుతోందని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సింది, సానుకూల అభిప్రాయం కలిగించాల్సింది సొంత కేడరే. కానీ… తెలంగాణ కాంగ్రెస్ ఆ విషయంలో స్తబ్దుగా ఉంది. ఓ కార్యాచరణ లేదు, టీం వర్క్ అసలే లేకుండా పోయిందన్న చర్చ సాక్షాత్తు గాంధీభవన్‌లోనే జరుగుతోందట. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కుల గణన చేసింది తెలంగాణ సర్కార్. పదవుల్లో బీసీలకు 42 శాతం వాటా ఇవ్వాలని సభలో తీర్మానం చేసింది. కానీ… ఆ విషయాన్ని ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, బీసీ నాయకుల్ని కలుపుకుని వెళ్ళడం, విస్తృత ప్రచారం కల్పించడం లాంటి పనులేవీ ఇంతవరకు జరగలేదు. పరిస్థితి చూస్తుంటే…అసలా అంశాన్ని పార్టీ పట్టించుకుందా లేదా అన్న డౌట్స్ వస్తున్నాయట. అటు ఎస్సీ వర్గీకరణది కూడా అదే పరిస్థితి. దేశం మొత్తం మీద ముందుగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. కానీ… దీన్ని జనంలోకి తీసుకేళ్ళే యాక్షన్ ప్లానే పార్టీ దగ్గర లేదంటున్నారు. కాంగ్రెస్‌కు మొదట్నుంచి దళిత సామాజిక వర్గం అండగా ఉంటుంది. వర్గీకరణ చట్టం చేసి… అమలులోకి వచ్చే వరకు ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ని సైతం ఆపేసినా…… దాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో లేవు పార్టీ కార్యకలాపాలు. ముఖ్య నాయకులు జిల్లాల వారీగా పర్యటనలు చేసి చర్చకు పెట్టాల్సి ఉన్న అంశాన్ని అడపా దడపా మీటింగ్స్‌తో మమ అనిపిస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే ఉంది. ఇక పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మరో సంచలన నిర్ణయం.
ప్రత్యేకించి ఇది గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన వ్యవహారం. పార్టీ నేతలు గ్రామాలు..మండల కేంద్రాలకు వెళ్లి టామ్ టామ్ చేయాల్సింది పోయి.. ప్రకటనలకే పరిమితం అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలీ విషయంలో పీసీసీ ఏం చేస్తోందన్నది బిగ్ క్వశ్చన్. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్.. కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ యాక్టివిటీ పెంచాల్సిఉన్నా ఆ వాతావరణం కనిపించడంలేదని మాట్లాడుకుంటున్నారట పార్టీలో. అటు మంత్రులేమో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పార్టీ చీఫ్‌గా మహేష్‌గౌడ్ ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై ఇంకా పెట్టడం లేదన్న అభిప్రాయం అయితే… పార్టీ వర్గాల్లో బలపడుతోందని చెప్పుకుంటున్నారు. పోనీ… కమిటీలు ఉంటే వాళ్ళతో పని చేసుకోవచ్చు. కానీ.. అవీలేవు. నాయకుల మధ్య సమన్వయం లేదు. ప్రతిపక్షం ముప్పేట దాడి చేస్తున్నా… అధికారంలో ఉండికూడా…. మౌనంగా చూస్తూ కూర్చోవడాన్ని ఎలా చూడాలన్న చర్చ జరుగుతోందట కాంగ్రెస్ కేడర్‌లో. అదంతా ఒక ఎత్తయితే… సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… పార్టీని ఇరకాటంలో పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణకు సాగు నేర్పింది ఆంధ్రా వాళ్ళేనంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పిసిసి చీఫ్ ఇప్పటికైనా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చి… జిల్లాల పర్యటనలు చేస్తూ….. ప్రభుత్వ పథకాల ప్రచారం మీద ఫోకస్ చేయాలని ఒకరిద్దరు మంత్రులే అంటున్న పరిస్థితి. మహేష్‌గౌడ్ దూకుడు పెంచకుంటే…. కష్టమని ప్రభుత్వం ఎంత చేసినా అది జనంలోకి వెళ్ళకుండా, చేసింది చెప్పుకోలేకపోతే ఉపయోగం ఏంటన్న చర్చ మొదలైందట గాంధీభవన్‌లో. మార్పు ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాలి మరి.