జిల్లా అధ్యక్షుల ఎంపిక అక్కడ బీజేపీలో చిచ్చు పెట్టిందా? కష్టపడ్డవాళ్ళకు కాకుండా…. కాకా రాయుళ్ళకు, చెప్పుచేతల్లో ఉండే వాళ్ళకు పదవులు ఇచ్చారన్న అసంతృప్తి పెరిగిపోతోందా? కనీసం కుల సమీకరణల్ని కూడా చూడకుండా… విచ్చలవిడి పంపకాలు జరిగాయా? కాషాయ కేడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడుంది? ఏ ఉమ్మడి జిల్లాలో తమకు కావాల్సిన వాళ్ళకి పంచేసుకున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తోందట. అధ్యక్షపదవి కోసం పోటీ పడ్డ నేతలే కాదు… క్యాడర్ సైతం కొన్నిచోట్ల అంసతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పార్టీ జెండా మోసిన, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళని కాదని ఎవరెవరికో ఇచ్చారని మండిపడుతున్నారట. ఇటీవల మంచిర్యాల, కొమురం బీం, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటించారు…నిర్మల్ జిల్లా పెండింగ్ లో ఉంది. ఇక్కడ కొనసాగుతున్న అంజుకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మధ్య అంతర్గత పోరు ఉన్నందునే పెండింగ్‌లో పడ్డట్టు సమాచారం. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు గౌడ్, కొమురం బీం జిల్లా అధ్యక్షుడిగా శ్రీశైలం ముదిరాజ్‌ను ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రహ్మానంద్‌నే కొనసాగించారు. ఎమ్మెల్యేలు లేదా జిల్లాలో కీలకంగా ఉన్న నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకోని పదవులు కట్టబెట్టారని, అంతకు మించిన అర్హులు ఉన్నాసరే….నేతల అండదండలున్న వారికే ఇచ్చారని నారాజ్‌గా ఉన్నారట కొందరు నాయకులు. మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే రెండు ఎస్సీ రిజర్వుడ్. ఎంపీ స్థానం సైతం ఎస్సీ రిజర్వుడే. అలాంటిది ఇక్కడ గతంలో ఓసీకి అధ్యక్షుడిగా ఇవ్వడం ఇప్పుడు బీసీకి ఇవ్వడం పట్ల ఎస్సీలు గుర్రుగా ఉన్నారట. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఎస్టీ, ఒక జనరల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎస్టీ, అందులో ఆదివాసీ ఓటర్లు, జనాభా ఎక్కువగా ఉన్న చోట బీసీకి ఇవ్వడంతో ఎస్టీ లీడర్స్ మండిపడుతున్నట్టు సమాచారం.
మరీ ముఖ్యంగా ఆదివాసీ నేత కోట్నాక్ విజయ్, కాగజ్ నగర్ నుంచి మరో నేత పదవి ఆశించారట. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుని కేటాయిస్తే ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యే అవకాశం ఉండేదని, కానీ… వేరే వారికి ఇవ్వడం ఏంటంటూ… కొంతమంది నేతలు తప్పుబడుతున్నారట. పైగా ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన మహిళలకు ఒక్కచోట కూడా అవకాశం ఇవ్వలేదు. సామాజికవర్గాల వారిగా చూసినా, మహిళా కోటా చూసినా…. అర్హులకు ఇవ్వలేదన్న ఆందోళన ఉందట స్థానిక బీజేపీ నేతల్లో. కొందరైతే పార్టీ మీటింగ్స్‌కు కూడా హాజరవడంలేదని తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరిగిందంటూ భగ్గుమంటున్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ లీడర్స్. ఇక నిర్మల్‌ని ప్రస్తుతానికి పెండింగ్ పెట్టినా … పదవిలో ఉన్న బడా నేత మాటే చెల్లుబాటు అయ్యేలా ఉందట. మంచిర్యాల ,కొమురం బీం జిల్లాల అధ్యక్షుల ప్రకటన క్యాడర్‌లో సైతం అసంతృప్తి పెంచిందని అంటున్నారు. కుల సమీకరణలుగాని, ఆర్ ఎస్ ఎస్ బ్యాగ్ గ్రౌండ్‌గాని, పార్టీకి లాయల్టీగాని, ఇమేమీ పట్టించుకోకుండా… కేవలం ఎమ్మెల్యే లేదా బలమైన రాష్ట్ర నేత అండదండలు ఉన్నవాళ్ళకు పదవులు ఇచ్చారంటూ మండి పడుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఓ వర్గం పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళిందట. కారణం ఏదైనా… జిల్లాస అధ్యక్షుల ఎంపిక చాలామందిలో నిరుత్సాహం నింపిందని అంటున్నారు పార్టీ నాయకులు. కనీసం శాలువా కప్పేందుకు సైతం క్యాడర్ వెనకాడుతోందన్న చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది గ్రూప్ వార్‌కు దారి తీస్తుందా? లేక పెద్దలు జోక్యం చేసుకుని సెట్ చేస్తారా అన్నది చూడాలి మరి.