వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్. పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసి రాక… ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై… ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్షా… అంటామని అడుగుతున్నా… ఓకే అని చెప్పలేని పరిస్థితి. ఏ లెక్కలు వాళ్ళకు అడ్డు పడుతున్నాయి? ఎవరా ఇద్దరు? ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు చేస్తోంది కూటమి. ఈ క్రమంలోనే ఎప్పట్నుంచో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల ప్రస్తావన మరోసారి తెర మీదికి వచ్చింది. కొత్త భర్తీలో.. తమకు ఛాన్స్ దక్కుతుందని ఆశగా ఉన్నారట ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నెట్టెం రఘురాం, దేవినేని ఉమా. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నెట్టెం రఘురాం… ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి 1985- 99 మధ్య వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. 1996 నుంచి 99 వరకు మూడేళ్లపాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోగా… ఆయన స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు అవకాశం ఇస్తూ వస్తోంది టీడీపీ అధిష్టానం. శ్రీరామ్ తాతయ్య కూడా జగ్గయ్యపేట నుంచి నాలుగు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారు. దీంతో నెట్టెం రఘురాం పోటీకి దూరం కావాల్సి వచ్చింది. ఇక మరో మాజీ మంత్రి దేవినేని ఉమా 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించారు. పార్టీలో, ప్రభుత్వంలో పూర్తిస్థాయి పెత్తనం చేసిన ఉమా… ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
స్వతహాగా నందిగామకు చెందిన ఉమా అక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మైలవరం నుంచి మరో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయిన దేవినేని… 2024లో అదే వసంత కోసం టీడీపీ టిక్కెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారట. అధిష్టానం చెప్పినట్టు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమకు ఈసారి ఛాన్స్ ఇస్తారన్నది వాళ్ల ఆశగా తెలుస్తోంది. కానీ… వాళ్ళ ఆశలు, ఆకాంక్షల సంగతి ఎలా ఉన్నా… కుల సమీకరణలు సహకరిస్తాయా అన్నది అతిపెద్ద డౌట్ అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనేది నెట్టెం రఘురాం వర్గం మాట. కానీ… ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను కూటమి తరుపున 6 స్థానాల్లో టిడిపి, ఒక చోట బిజెపి పోటీ చేసి మొత్తం గెలిచాయి.
ఎంపీ స్థానంలో కూడా టిడిపి అభ్యర్థి కేశినేని చిన్ని విజయం సాధించారు. అయితే… ఇక్కడే కులాల లెక్కలు తేడా కొడుతున్నాయట. ఏడులో మూడు చోట్ల కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎంపీ కేశినేని చిన్నిది కూడా అదే కులం కావడం, ఇప్పడు ఎమ్మెల్సీ ఆశిస్తున్న ఇద్దరు నాయకులది కూడా కమ్మ సామాజిక వర్గమే కావడంతో… టీడీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయట. ఈ ఇద్దరికీ ఇప్పుడు కులమే అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో తమ సామాజిక వర్గంలో పార్టీకి ఎంత సపోర్ట్ ఉందో… పదవులు పొందే టైంలో అదే మైనస్‌గా మారుతోందని మాట్లాడుకుంటున్నారట కొందరు కమ్మనాయకులు. ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఇప్పటికే… బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా రేస్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రులకు ఎమ్మెల్సీ పదవులు ఎంతవరకు దక్కుతాయన్నది ప్రశ్నార్ధకమేనని అంటున్నారు పరిశీలకులు.
ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి.