ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే…. అబ్బా… ఇప్పుడొద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటూ ఎక్కడలేని సణుగుళ్ళూ సణిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట. పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలుపెట్టేశారట. అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం…. ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉందట. ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయిన ఆ పదవి ఏది? ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగిపోయింది? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట. ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకోమని అధిష్టానం పదేపదే అడిగినా… స్పందించకుండా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా వ్యవహరించిన నాయకులు… అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఛాన్స్ తమకే ఎందుకు ఇవ్వాలో కూడా వివరాలు వివరాలుగా చెప్పేస్తున్నారట. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యత పెరగడం లాంటివన్నీ… ఇప్పుడు తెలంగాణ టీడీపీ నాయకుల్ని రా… రమ్మని పిలుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఆఫీస్‌కు వచ్చి పోతుండటం, రాష్ట్రంలో పూర్వ వైభవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట కొందరు పార్టీ నాయకులు. ఒకప్పుడు తెలంగాణ అధ్యక్షుడి కోసం అధిష్టానమే చుక్కానీ వేసి వెదికినా… దొరకని నేతలు ఇప్పుడు మాత్రం మేమంటే మేం అంటున్నట్టు సమాచారం. కానీ…. ఇప్పటికీ పోస్ట్ మాత్రం భర్తీ అవలేదు. ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిని నియమిస్తారని ముందు ప్రచారం జరిగినా… ఇప్పుడు పోటీ పెరిగిపోవడంతో…. వేచి చూసే ధోరణిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గింది టీడీపీ. పోటీ చేయొద్దన్న నిర్ణయానికి నిరసనగానే రాజీనామా చేసి వెళ్ళిపోయారు నాటి పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఇక అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది.
అయితే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో ఇప్పటికీ పార్టీకి బలమైన కేడర్ ఉందని చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వీక్ అయినప్పటికీ కొందరు నాయకులు మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. భవిష్యత్‌లోనైనా తమకు పదవులు రాకపోతాయా అన్నది వారి ఆశ అట. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఉండటంతో…. ఇక తెలంగాణలో కూడా పార్టీకి మంచిరోజులు వస్తాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడి, ఆయన ఆశీస్సులు తీసుకుంటే చాలు… టైం స్టార్ట్ అయినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయని కొందరు అనుకుంటున్నారట. ఆ దిశగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు సమాచారం. కొంతమంది నేరుగా బాబును కలుస్తుండగా…మరి కొందరు లోకేష్, బాలకృష్ణ సోర్స్‌లో తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కట్టే అవకాశం ఉందని, అప్పుడు తాము కీలకంగా మారతామన్నది కొందరు తెంలగాణ టీడీపీ నాయకుల ఆలోచనగా తెలిసింది. తెలంగాణలో కూడా కూటమి ఓకే అయితే… అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తమకు విలువ పెరుగుతుంది కాబట్టి…. ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదన్నది కొందరి అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి క్రేజ్ పెరిగిందని అంటున్నారు. అయితే మెుదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, సీనియర్ నాయకుడు అరవింద్ కుమార్ గౌడ్, టీటీడీ బోర్డ్ సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరి కొందరి పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరందరితో పాటు ఆర్ధికంగా స్థితిమంతుడైన ఓ కేంద్ర మంత్రి బంధువు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చివరికి ఎవరు తెరమీదికి వస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తోంది తెలంగాణ టీడీపీ కేడర్.