టీడీపీలో కోవూరు కోలాటం రసవత్తరంగా మారుతోందా? ఎమ్మెల్యే మాటల్ని మండల స్థాయి నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదా? అవినీతి, అక్రమాలకు దూరం ఉండమని పదే పదే చెబుతున్నా వాళ్ళ చెవికెక్కడం లేదా? ఎమ్మెల్యేనా…. అయితే ఏంటన్న ధోరణి పెరిగిపోతోందా? అసలేం జరుగుతోందక్కడ? నెల్లూరు జిల్లా కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు ..విడవలూరు.. ఇందుకూరుపేట మండలాల్లో విస్తరించి ఉంటుంది కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాష్ట్రంలో కూడా కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో… ఇక్కడి మండల స్థాయి నాయకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. అంత వరకైతే చెప్పుకోవాల్సిన పనిలేదుగానీ…. ఆ ఉత్సాహం ఉరకలేసి, ఆ ఉరకలు పరిధి దాటిపోవడమే అసలు సమస్య అంటున్నారు పరిశీలకులు. వైసీపీ హయాంలో ఈ నియోజకవర్గ మండల స్థాయి నేతలు అడ్డగోలుగా దోచేశారని, అవినీతిని కొత్త పుంతలు తొక్కించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు టీడీపీ మండల నాయకులు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ రూట్‌లో వెళ్ళడమే అసలు సమస్య అంటున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎక్కడికక్కడ వారికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో…. ఆమెకు, టీడీపీ మండల నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
స్థానిక అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో కూడా… నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఎమ్మెల్యే. ఇది కొందరు నాయకులకు మింగుడుపడని వ్యవహారంగా తయారైనట్టు చెప్పుకుంటున్నారు. మొదట్లో కాస్త తగ్గినట్టు కనిపించినా….మెల్లిగా స్థానిక నేతల చేతివాటం పెరుగుతోందట. అవినీతికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పదేపదే చెబుతున్నా…. ఎవ్వరూ పెద్దగా బుర్రలోకి ఎక్కించుకుంటున్నట్టు కనిపించడం లేదన్నది లోకల్ టాక్. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక నేత గ్రావెల్, మట్టి అక్రమ రవాణాను జోరుగా చేస్తున్నారట. ఇక కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో కూడా.. నేతలు మేమేం తక్కువ తిన్నా… తగ్గేదే అంటున్నట్టు సమాచారం. అలాగే… ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి పార్టీ మారి వచ్చిన నేతలు… మళ్లీ ఇక్కడ కూడా పెత్తనం చెలాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పాత టీడీపీ నాయకులు దీన్ని తట్టుకోలేకపోతున్నారట. మండల స్థాయి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు.. ఎక్కడికక్కడ నాయకులకు బాధ్యతలు అప్పగించారు ఎమ్మెల్యే. అందులో కొందరు బాగానే పనిచేస్తున్నా… మరికొందరు మాత్రం అవినీతి.. అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేకి సమీప బంధువు ఒకరు నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇసుకతో పాటు కాంట్రాక్టు వ్యవహారాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడం.. కిందిస్థాయి నేతల్లో అసంతృప్తికి దారి తీస్తోందట. ఇది నేతల మధ్య విభేదాలకు కూడా దారి తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తాడేపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో సమావేశం జరుగుతుండగా.. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన నాయకులు…నెల్లూరు నేతలు.. పరస్పరం వాగ్వాదానికి దిగారట. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో తమకు తెలియకుండా ఉద్యోగుల బదిలీలు …సెటిల్మెంట్లు.. పోలీస్ స్టేషన్ల వ్యవహారాలను నెల్లూరు నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరులో ఉండే నేతలు తమ మండలంలో పెత్తనం చెలాయించడం ఏంటంటూ కోప్పడ్డట్టు తెలిసింది. రెండు వర్గాల నేతలూ.. ఘర్షణకు దిగే పరిస్థితి ఏర్పడడంతో… ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సర్దిచెప్పారట. అదేవిధంగా కోవూరు ..విడవలూరు.., కొడవలూరు.. మండలాల్లో కూడా నేతల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. కొడవలూరు మండలంలో భూములకు సంబంధించి ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఇసుక ….గ్రావెల్‌తో పాటు పలు కాంట్రాక్టులను ఎమ్మెల్యే సమీప బంధువు చేస్తుండడంతో కిందిస్థాయి నేతలు రగిలిపోతున్నారట. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తమను పట్టించుకోకుండా ఒకరికే ఆర్థికంగా ప్రయోజనం కలిగించేలా… చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ నేతల మధ్య అంతర్గతంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది. మండల నేతల మధ్య తీవ్ర మవుతున్న విభేదాలను ఎమ్మెల్యే ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.