తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తరంగాలు ఎట్నుంచి ఎటెటో ప్రయాణిస్తున్నాయా? కేసు దర్యాప్తు కొత్త టర్న్ తీసుకోబోతోందా? అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్స్ వచ్చేశాయి.. కేసు కథ కంచికేనన్న ప్రచారం మొదలైన టైంలో కీలకమైన మలుపు తిరగబోతోందా? హస్తం, కమలం మధ్యలో గులాబీ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందా? అసలేంటి.. కొత్తగా మొదలైన కథ? ఆ విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా జరుగుతున్న యుద్ధంలోకి కొత్తగా బీజేపీ ఎంటరవడంతో మేయర్ యమా రంజుగా మారుతోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ట్యాపింగ్ దోషుల్ని కాపాడుతోంది మీరంటే మీరేనంటూ… కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండటం, ప్రత్యేకించి ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ఈ మేటర్ మరోసారి తెర మీదికి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మొబైల్ తరంగాలు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటాయోనన్న చర్చ మొదలైంది. ఈ రెండు పార్టీల వాలకం చూస్తుంటే ఈ ఇష్యూని ఇప్పట్లో ముగించేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఇరుకున పెట్టుకునే ప్రయత్నంలో ఉండటంతో… కథలో కొత్త మలుపులు ఉంటాయా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కేసులో దోషులను కాంగ్రెస్ నేతలు కాపాడుతున్నారంటూ కొంత కాలంగా ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. అరెస్ట్ అయిన వారు బీఆర్‌ఎస్ అగ్రనేతల పేర్లు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది బీజేపీ క్వశ్చన్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఈ కేసులో నిందితులు ప్రభాకర్‌రావు, శ్రావణ్‌రావు విదేశాల్లో ఉన్నారని, బీజేపీ నాయకులు కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించి వారిని ఇండియాకు రప్పిస్తే… ఆ వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న బీఆర్‌ఎ నేతలను అరెస్ట్ చేస్తామని అన్నారు. ఆ లెక్కన చూస్తే… బీజేపీనే ఫోన్ ట్యాపింగ్ నిందితుల్ని కాపాడుతోందన్నది సీఎం రేవంత్ ఆరోపణ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి వెంటనే కౌంటర్ వేయడంతో మేటర్ రసకందాయంలో పడింది.
ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు దేశం విడిచి వెళ్లారని, అందుకు కారణం మీరేనంటూ రాష్ట్ర ప్రభుత్వంవైపు వేళ్లు చూపిస్తున్నారు బీజేపీ లీడర్స్. ఈ కేసును కాంగ్రెస్ వదిలినా మేం వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న కిషన్ రెడ్డి అన్నారు వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో రెండు పార్టీల నాయకుల మాటలు వింటున్న వాళ్ళు మాత్రం… ఈ కేసును ఇద్దరూ అంత తేలిగ్గా వదిలేట్టులేరు. పైగా ఇష్యూని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకునే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు జాతీయ పార్టీల పొలిటికల్ అడ్వాంటేజ్ ప్లానింగ్‌లో బీఆర్‌ఎస్ నసిగిపోవడం ఖాయమన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను మీరు కాపాడుతున్నారంటే… మీరే కాపాడుతున్నారంటూ… కాంగ్రెస్, బీజేపీ ఆరోపించుకుంటూ ఇష్యూని మాత్రం లైవ్‌లో ఉంచుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ వచ్చింది… ఇక ఈ కేసు సంగతి అంతేనన్న ప్రచారం మొదలైంది. ఈ పరిస్థితుల్లో…. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల ఆరోపణలతో… పిక్చర్ అభీ బాకీ హై అన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా గులాబీని నలిపేస్తున్నాయన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇలా ఆ రెండు పార్టీలు పట్టుదలగా ఉంటే…. మూడో పార్టీ బీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ఏదో ఒక రకంగా కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునేలా బీజేపీ ప్రయత్నం చేస్తోందట. ఎమ్మెల్యేల ఫార్మ్ హౌస్ కేసులో.. తమ ముఖ్య నాయకుడు బి ఎల్ సంతోష్‌ను బీఆర్‌ఎస్ ఇరికించే ప్రయత్నం చేసినందున బీజేపీ అంత ఈజీగా వదలక పోవచ్చన్నది కొందరి అభిప్రాయం. అటు కాంగ్రెస్ కూడా దోషుల్ని ఫిక్స్ చేసి చర్యలు తీసుకోవడం ద్వారా తమను తాము నిరూపించుకోవాలని అనుకుంటున్నారట. సో… ఈ మాటల యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందోనిన ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ పొలిటికల్ పండిట్స్.