ధర్మవరం సీటు రాకపోయినా…టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ సంతోషంగా ఉన్నారా ? పొత్తుల్లో భాగంగా ధర్మవరం బీజేపీకి వెళ్లిపోయినా సత్యకుమార్ కు అండగా ఉంటానని చెప్పడం వెనక మతలబు ఏమైనా వుందా? తనకు రాకపోయినా పర్వాలేదు…తన శత్రువుకు మాత్రం రాకూడదన్నదే శ్రీరామ్ లక్ష్యమా ? లేదంటే అంతకు మించిన స్ట్రాటజీ వుందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సుదీర్ఘ అనుబంధమున్న పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్ రాకపోవడం గురించే అంతటా డిస్కషన్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సూర్యనారాయణ విజయం సాధించారు. ఐదేళ్ల తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ధర్మవరం కూడా ఫ్యాన్ కే సొంతమైంది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిపోయారు సూర్యనారాయణ. దీంతో ఈ నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేత లేకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కూడా ధర్మవరం ఇంఛార్జ్ గా శ్రీరామ్ ను నియమించారు. నిత్యం పార్టీ కార్యక్రమాలతో టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు శ్రీరామ్. కానీ పొత్తు ఆయన అంచనాలను తలకిందులు చేసింది.
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సూర్యనారాయణకు 2024 ఎన్నికల బరిలో వుంటారన్న చర్చ సాగింది. దీంతో పరిటాల వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిటాల శ్రీరామ్ కే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు.అయితే, పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి పోయింది. సూర్యనారాయణకు టికెట్ ఇస్తే….ఓడిస్తామంటూ పరిటాల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటాపోటీగా ర్యాలీలు చేశారు. దీంతో క్రాస్ ఓటింగ్ తో మొదటికే ఎసరు తప్పదని అనుమానించిన బీజేపీ…సూరిని కాకుండా వై. సత్యకుమార్ ను బరిలోకి దించుతున్నట్టు ప్రకటించి, అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ధర్మవరం సీన్ మొత్తం మారిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో తాడిమర్రి, బత్తలపల్లి టిడిపి కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదని, మిగిలినదంతా సేమ్ టు సేమ్ అని వ్యాఖ్యానించడంతో బీజేపీ బీపీ కాస్తా హ్యాపీగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు కష్టపడతానని శ్రీరామ్ చెప్పడం అందర్నీ ఆలోచనలో పడేసింది. టికెట్ రానంతమాత్రాన పారిపోయే వ్యక్తిని కాదని …కొందరిలాగా ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైపు కాదని పరోక్షంగా వరదాపురం సూరి గురించి వ్యాఖ్యలు చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. త్యాగం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపించానని…కష్టం వచ్చినా…నష్టం వచ్చినా.. తన ప్రయాణం ధర్మవరంతోనే ముడిపడి ఉందని చెప్పారు….ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరు.. ఇప్పుడన్న శ్రీరామ్ వేరని …. బిజెపి అభ్యర్థి సత్యకుమార్ ని గెలిపించాల్సిన బాధ్యత టిడిపి కార్యకర్తలప్తె ఉందని శ్రీరామ్ చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గత్యంతరంలేని పరిస్థితుల్లో పక్కా వ్యూహంతోనే పరిటాల శ్రీరామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న డిస్కషన్ సాగుతోంది. నియోజకవర్గంలో తన ప్రత్యర్థి వరదాపురం సూరికి చెక్ పెట్టడంతో పాటు … బిజెపి అభ్యర్థి సత్యకుమార్ కు సపోర్ట్ చేసి పరిటాల శ్రీరామ్ మైలేజ్ కొట్టబోతున్నాడని రాజకీయ వర్గాల్లవో ప్రచారం సాగుతోంది. మొత్తానికి వ్రతం చెడ్డా…పూజ ఫలించాలన్న స్ట్రాటజీతో పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారని లోకల్ గా మాట్లాడుకుంటున్నారు. ఇంతగా చర్చనీయాంశమవుతున్న ధర్మవరం రిజల్ట్ ఎలా వుండబోతోందో అన్నది ఉత్కంఠగా మారింది.