Off The Record: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి వైరస్ అంటుకుందా? ఎంత ట్రీట్‌మెంట్ ఇద్దామని చూసినా… వదలనంటూ మొండికిపడుతోందా? వైద్యుల బదిలీల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ప్రచారంలో నిజమెంత? అమ్యామ్యాలకు అలవాటుపడి అర్హుల్ని జాబితా నుంచి తప్పించారా? చేతులు తడుపుడు వ్యవహారంలో మంత్రి పేషీ ప్రమేయం ఉందన్న మాటల్లో నిజమెంత? బదిలీ బాగోతంపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో ఏముంది?
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో ఏదో జరిగిపోతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్లు, నర్సుల బదిలీల్లో భారీగా అవకతవకలు జరిగాయని, వెనక వ్యవహారం చాలా ఉందన్న ఆరోపణలు సంచలనం అవుతున్నాయి. బదిలీల్ని పారదర్శకంగా నిర్వహించాలంటూ… ఉద్యోగులు ఏకంగా ఆందోళనలుచేసేదాకా వెళ్ళారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. బదిలీ లీలలపై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసినట్లు సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు డాక్టర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అందుకే సీనియార్టీ జాబితాలో పలువురి పేర్లు మాయం అయ్యాయని, మరికొందరివి తప్పుడు వివరాలు నమోదయ్యాయని నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ఆఫీస్‌లోని కొందరు సిబ్బందికి సైతం ఇందులో పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంలో పాతుకుపోయిన నర్సుల నుంచి ప్రొఫెసర్ల దాకా తమ సీట్లను పదిలం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కినట్టు గుర్తించారట. ఈ క్రమంలో చేతులు మారిన డబ్బు కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీహెచ్ కార్యాలయం, అందులో పని చేసే అధికారులతో పాటు, మంత్రి ఆఫీస్‌లోని అధికారులు, వివిధ అసోసియేషన్ల నాయకుల హస్తం ఇందులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో పనిచేసేందుకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఆసక్తి చూపిస్తున్నారట.
చాలా మంది ప్రభుత్వ దవాఖానలో పార్ట్ టైమ్ పని చేస్తూ.. సొంతంగా ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్స్ పెట్టుకోవడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ల ద్వారా అదనపు ఆదాయానికి అలవాటుపడ్డారని, అలాంటి వాళ్లే కావాల్సిన చోట పోస్టింగ్ కోసం ఎంతైనా ముట్టజెప్పడానికి సిద్ధమవుతున్నారన్నది డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్నల్ టాక్. నాలుగు సార్లు రివైజ్ చేసినా, సీనియారిటీ లిస్టు తప్పుల తడకగా ఉండటానికి అదే కారణమంటున్నారు. హైదరాబాద్ పరిధిలో కొంత మంది సీనియర్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర కేడర్ ఉద్యోగులు దశాబ్దాల తరబడి ఇక్కడే పనిచేస్తున్నా… కదల్చకపోవడం, ఒకవేళ ట్రాన్స్‌ఫర్ చేసినా… రాత్రికి రాత్రే పోస్టింగ్ ఆర్డర్లలో మార్పులు జరగడం లాంటి వాటిని చూస్తే… ఆ లాబీ ఏ స్థాయిలో పని చేస్తోందో అర్ధమవుతోందని అంటున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సాధారణ ఉద్యోగులు. ల్యాబ్ టెక్నిషియన్ కౌన్సిలింగ్ లో తొలుత ఖాళీలు ఉన్న చోట పోస్టింగ్ లు ఇచ్చారు. ఆ తర్వాత ఆర్డర్లలో మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయడం లేదని, అందరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు షిప్ట్ చేస్తూ వేరే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదంతా గవర్నమెంట్ ఆర్డర్‌ని బ్రేక్ చేయడమేనని, ఫిర్యాదు చేసినా…ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. అసలిదంతా మంత్రి దృష్టిలో ఉండి జరుగుతోందా? లేక ఆయన్ని పట్టించుకోకుండా ఉన్నతాధికారులే ఆటాడుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోందట ఉద్యోగ వర్గాల్లో.
ప్రధానంగా పబ్లిక్ హెల్త్ విభాగంలో బదిలీలు గందరగోళంగా మారాయి. డీఎంఈ, టీవీవీపీ తదితర విభాగాల్లోనూ భారీగా డబ్బులు చేతులు మారాయని, పైకి రానీయకుండా… లోలోపల పని కానిచ్చారన్న ఆరోపణలుసైతం వస్తున్నాయి. వైద్యుల సీనియార్టీ జాబితాను రాత్రికి రాత్రే మార్చి కొత్త జాబితా రూపొందించి, అది అమలు చేసే లోపే మరో ఫైనల్ జాబితా అంటూ మార్చేసిన సందర్భాలు సైతం ఉన్నాయట. కీలక పోస్టుల్లో ఏళ్ళ తరబడి పని చేస్తున్న వారిని బదిలీ చేయాల్సివచ్చినప్పుడు జూబ్లీహిల్స్ నుంచి కోటి కార్యాలయానికి, కోఠి నుంచి పక్కనే ఉన్న మరో ఆఫీసుకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చన్నది డిపార్ట్‌మెంట్ టాక్. ఓ సీనియర్ స్టాఫ్ నర్స్ ను సూర్యాపేటకు ట్రాన్స్ ఫర్ చేశారు. తర్వాత పైరవీతో ఆమెను హైదరాబాద్ లోని పేట్లబురుజు ఆసుపత్రికి బదిలీ చేశారట. దీంతో ఏకంగా కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు నర్సులు ధర్నా చేయాల్సి వచ్చింది. ఇలాంటి దందాల్లో మంత్రి ఆఫీసు అధికారుల హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి పేరు చెప్పి పలు జిల్లాల డీఎంహెచ్‌వోల నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని.. అడిగినంత ఇస్తేనే ఆ పదవిలో కొనసాగుతారని.. లేదంటే వేటు తప్పదని బెదిరించారన్న ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయట. మరి ఈ గూడుపుఠాణీ మంత్రి దృష్టికి వెళ్ళిందా? లేదా? ఒకవేళ వెళితే చూసీ చూడనట్టు ఉదాసీనంగా ఉన్నారా? ఇక మీదటైనా యాక్షన్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో.