దేశంలో ఎక్కడ లిక్కర్ స్కాం బయటపడ్డా… అందరి దృష్టి తెలంగాణవైపే మళ్ళుతోందా? తాజాగా తమిళనాడు మద్యం కుంభకోణం విషయంలో కూడా మరోసారి తెలంగాణ వైపు తొంగిచూసే పరిస్థితి వస్తోందా? అసలు తమిళనాడు లిక్కర్ వ్యవహారానికి, తెలంగాణకు ఏంటి సంబంధం? ఇటువైపు చూడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఢిల్లీ మద్యం కుంభకోణం తరహాలోనే…..తమిళనాడులో కూడా పెద్ద స్కామే జరిగిందా? అక్కడి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందా? అంటే….. ఇప్పుడే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేంగానీ… మొత్తానికి జరగకూడనిదేదో….జరిగిపోయిందని మాత్రం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అక్కడ ఈడీ దూకుడు చూస్తుంటే మద్యం వ్యాపారంలో వేల కోట్ల స్కామ్ జరిగినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడవచ్చని కూడా చెప్పుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో లిక్కర్ వ్యవహారం మరోసారి చర్చనీయంశమైంది. తమిళనాట ఈడీ దర్యాప్తుతో… లిక్కర్ లైసెన్సుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఉండవచ్చన్నది అంచనా. అర్హత లేని కంపెనీలకు అనుమతులు ఇచ్చి, ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం కలిగించినట్టు గుర్తించారట దర్యాప్తు అధికారులు. ప్రభుత్వ అధికారులు, బిజినెస్ మాఫియా కలిసి ఈ స్కామ్‌లో పనిచేసినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వ అనుమతులు పొందడానికి లక్షలాది రూపాయల లంచాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్‌తో తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. లైసెన్స్‌ల విషయంలోనే భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు పెరుగుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ, దర్యాప్తు జరుగుతోందని, అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అటు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ బృందం స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తోంది. త్వరలోనే పూర్తి నివేదిక సమర్పించనుంది. దీని తర్వాత కేసు మరింత బలపడే అవకాశం ఉందని అంటున్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, అసలు దోషులు పట్టుబడతారా? లేదా? అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారిందట. ఇదిలా ఉండగా… ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు, తమిళనాడులో వెలుగుచూసిన స్కాం సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఓ కీలక పార్టీ నేత అధికారంలో ఉన్నప్పుడు తరచూ తమిళనాడుకు వెళ్లడం, అక్కడ సీఎం స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్థాలిన్‌ను కలిసిన క్రమంలో సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నం చేశారా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఆప్‌ను ముంచిన వారే ఇప్పుడు తమిళనాడులో డీఎంకేను ముంచబోతున్నారంటుూ రచ్చ మొదలైంది. అయితే.. అవన్నీ సోషల్ మీడియా అనుమానాలేనా? లేక నిజంగానే లింక్‌లు ఉన్నాయా? అవన్నీ ఆరోపణలేనా అన్నది తేలాలంటే…. టాస్క్‌ఫోర్స్ నివేదిక వచ్చేదాకా వేచి చూడాల్సిందే.