నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పడేసిందా? ఆయన అనుభవం, గతాన్ని పరిగణనలోకి తీసుకుంటే… పరిగెత్తుకుంటూ రావాల్సిన అవకాశాలు ఎందుకు రావడం లేదు? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన వేడుకుంటున్నా… ఆ…. చూద్దాం లే…. అన్నట్టుగా ఎందుకు మారుతోంది? ఎవరా లీడర్? సుదీర్ఘ రాజకీయ అనుభవం పెట్టుకుని… అధికార భాగస్వామ్య పార్టీలో ఉండి కూడా అర్రులు చాచాల్సి రావడానికి కారణాలేంటి? కొత్తపల్లి సుబ్బారాయుడు….. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు విడతలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 1999-2004 మధ్య విద్యుత్ శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించారు కొత్తపల్లి. ఒకసారి ఎంపీగా కూడా చేశారు. వీటన్నిటికీ మించి కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండికూడా… ఇప్పుడాయన ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అవకాశాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. ఏం…. ఎందుకలా అంటే… అంతా స్వయంకృతం అన్నది ఎక్కువ మంది చెప్పే సమాధానం. కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయ చరిత్ర చూస్తే… 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు నరసాపురం అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ తరపున గెలిచారు. సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్‌గా హవా నడుస్తున్న టైంలో… ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని అంటారు రాజకీయ పరిశీలకులు. టిడిపిలో తిరుగులేని నేతగా, గోదావరి జిల్లాల్లో పట్టున్న పొలిటీషియన్‌గా కొనసాగుతున్న సమయంలో తనకు రాజకీయ అవకాశాలిచ్చిన పార్టీని వదిలి తాను అభిమానించే హీరో పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు కొత్తపల్లి. ఇక అక్కడి నుంచి మొత్తం రివర్స్ గేరేనని అంటున్నారు. 2009 నుంచి సుబ్బారాయుడు వరుసగా తీసుకున్న నిర్ణయాలు ఆయన పొలిటికల్ కెరీర్‌ని ఘోరంగా దెబ్బతీశాయన్నది విస్తృతాభిప్రాయం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు అదే పార్టీ తరపున 2009లో నరసాపురం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడం, తిరిగి 2012లో ఉప ఎన్నిక జరగడంతో… అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాజీ మంత్రి. అక్కడ వరకు ఫర్లేదని అనుకున్నా… ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారాయన. మూడోసారి పార్టీ మారినా ఉపయోగం లేదని భావించిన కొత్తపల్లి… తిరిగి టిడిపిలోకి ఎంటరై కాపు కార్పొరేషన్ చైర్మన్ ఛైర్మన్ అయ్యారు. పోనీ… అప్పుడైనా కుదురుగా ఉన్నారా… అంటే అదీ లేదు. 2019 ఎన్నికల నాటికి తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలా… ఐదోసారి పార్టీ మారినా ఆయనకి కలిసి రాలేదు. రెండోసారి కూడా వైసీపీలో లోకల్ ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగా బయటికొచ్చారు. 2024 ఎన్నికలకు ముందు వరకు న్యూట్రల్‌గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఆ ఎన్నికల్లో టీడీపీ సీటు ఇస్తే పోటీ చేద్దామని ఎదురు చూశారట. అవకాశం లేకపోవడంతో చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకున్నారు. అలా… టిడిపిని వదిలి ప్రజారాజ్యంలో అడుగుపెట్టిన నాటి నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడుకు పొలిటికల్‌గా అస్సలు కలిసి రాలేదని అంటారు. ఈ క్రమంలో…. ప్రస్తుతానికి జనసేనలోనే కొనసాగుతున్న కొత్తపల్లి సుబ్బారాయుడు…. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గానే ఉన్నా…. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఆయన అనుచర వర్గం అసంతృప్తిగా ఉందట. దీంతో కనీసం ఇప్పుడన్నా…. సుబ్బారాయుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా? లేక ఇతివార్తాహ అంటారా అన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన కీల భాగస్వామిగా ఉండటం, సుబ్బారాయుడి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు గుర్తింపు ఇస్తారా? లేక ఆయన మారని పార్టీ అంటూ లేదని… నిలకడలేని నాయకుడిని ఇచ్చి మాత్రం ఉపయోగం ఏంటనుకుని పక్కకు పెట్టేస్తారా అన్న ఆందోళన ఉందట ఆయన శిబిరంలో. మరో విడత నామినేటెడ్ పోస్టుల హడావిడి మొదలవుతున్న క్రమంలో… జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు కొత్తపల్లి అనుచరులు. ఆయన అనుభవం పనికొస్తుందా? లేక నిలకడలేని తత్వం మరోసారి దెబ్బేస్తుందా అన్నది చూడాలి మరి.