Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే వేషం మారింది.. భాష మారింది… మొత్తంగా ఆయన తీరే మారిపోయింది. అయ్యో… అధికారం పోతే… ఇంతలా మారిపోతారా అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారట చూస్తున్న వాళ్ళు. గతంలో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే ఆ మాజీ స్వరంలో కూడా కాస్త తేడా వచ్చిందట. ఇంతకీ ఎవరాయన? ఎందుకు ఆ రేంజ్‌లో మార్పు?
రాజకీయ నాయకులన్నాక ఖద్దర్ వేయడం, కాస్ట్లీ కార్లలో తిరుగుతూ… దర్పం ఒలకబోయాలనుకోవడం కామన్. కానీ… ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం ఆ మూసలోకి వెళ్లకుండా తనకో స్టైల్ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు ఓటమి చూశారాయన. ఎప్పుడో తప్ప ఖద్దర్ జోలికిపోని మాజీ ఎమ్మెల్యే….ఎప్పుడూ కలర్ ఫుల్ డ్రస్సులతో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు, బైక్ రైడింగ్స్‌తో సగటు ఎమ్మెల్యేకి భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహారశైలి. ఇక కేతిరెడ్డి ఏదైనా మాట్లాడారంటే… పక్కా ఎవిడెన్స్ ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం. ఇలా ఒక భిన్నమైన దారిలో వెళ్తున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా కృంగదీసిందట. గతంలో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదుగానీ… ఈసారి మాత్రం నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే.. ఇలాంటి తీర్పు ఇచ్చారా అంటూ తెగ ఫీలై పోతున్నారట సన్నిహితుల దగ్గర. అందుకు తగ్గట్టుగానే.. ఆయన వేషంలో కూడా ఇంకా బాగా మార్పు వచ్చిందంటున్నారు. ఎప్పుడూ కలర్ ఫుల్ గా కనిపించే కేతిరెడ్డి… ఇప్పుడు గడ్డం పెంచుకొని చాలా డీ గ్లామర్ గా కనిపిస్తున్నారన్నది ఆయన సన్నిహితుల్లో టాక్. ఇక గతంలో ఏ విషయమైనా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే కేతిరెడ్డి… ఇప్పుడు ఒకరకమైన స్వరంతో మాట్లాడుతున్నారట.
అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు వాటి మీద విచారణ జరిపించాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బత్తలపల్లి సమీపంలో నిడిమామిడి భూముల విషయంపై కేతిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అధికార పక్షం నేతలు. వాస్తవంగా ఈ భూములు కేతిరెడ్డి పేరు మీద లేవు. అయితే ఆంజనేయస్వామి మఠానికి సంబంధించిన భూములను వైసీపీ నేతలు కాజేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాని వెనక కేతిరెడ్డి ఉన్నారని ప్రత్యక్షంగా చాలామంది ఆరోపిస్తున్నారు. అలాగే ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నిటి మీద విచారణ జరిపించాలన్నది ఆయన ప్రత్యర్థుల డిమాండ్. అయితే.. మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా… నిడిమామిడి మఠం భూముల విషయంలో మాత్రం ఆయన కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ భూములకు తనకు ఎలాంటి సంబంధం లేదని, సమగ్ర విచారణ చేపట్టాలంటూ రివర్స్ అటాక్ మొదలు పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడున్న పాలకపక్షం మాటలకే పరిమితమైతే… తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అంటున్నారట కేతిరెడ్డి. మొత్తంగా మారిపోయిన కేతిరెడ్డి తీరుపై గట్టి చర్చే జరుగుతోంది నియోజకవర్గంలో.