ఆలస్యం అమృతం… విషం.. అన్నది నానుడి. ఆ పార్లమెంట్ సీట్ విషయంలో హస్తం పార్టీ తీరు అమృతం స్టేజ్ దాటి పాయిజన్ అయ్యే ప్రమాదం ముంచుకొస్తోందట. అభ్యర్థి ప్రకటనలో జరుగుతున్న తాత్సారం మొదటికే మోసం తెచ్చేలా ఉందంటున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరుతోనే అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారా? లేక వేరే కారణం ఉందా? ఏదా లోక్‌సభ సీటు? ఏంటా కథ? కరీంనగర్ లోక్‌సభ సీటుకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే…. పది విడతలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి చోట 2009 తర్వాత ఆ పార్టీకి అవకాశమే దక్కలేదు. ఈసారి రూట్ మార్చి రిజల్ట్‌ని తిరగరాయాలన్న పట్టుదలగా ఉంది పీసీసీ నాయకత్వం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లకు గాను నాలుగింటిని గెల్చుకోవడం కూడా ఆ పార్టీకి ఊపునిస్తోందట. గత మూడున్నర దశాబ్దాల్లో హస్తం పార్టీకి ప్రత్యేకించి ఇక్కడ ఇన్ని అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఆ ఊపుతోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. గతంలో ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పొన్నంకి ఇది సిసలైన ఛాలెంజ్ అంటున్నారు పరిశీలకులు. ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 లక్షలకు పైగా ఓట్లు రావడంతో పార్లమెంట్‌పై ధీమాగా ఉన్నారట నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే పనిచేస్తే… కచ్చితంగా గెలవవచ్చన్నది కాంగ్రెస్ ముఖ్యుల ఆలోచనగా తెలిసింది. కానీ… అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు తయారైందట పార్టీ పరిస్థితి. ఎంపీ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే రేంజ్ లీడర్ అభ్యర్థిగా లేకపోవడం మైనస్‌గా మారిందంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్దులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా… కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎంపికపై ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు మారింది. టికెట్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నా చివరికి ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మరో నేత వెలిచాల రాజేందర్‌రావులలో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ప్రవీణ్ రెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభం, ముల్కనూర్ సహకారం సంఘంలో కీలకంగా వ్యవహరించడం కలిసి వస్తాయని అనుకుంటున్నారట. ఇక వెలిచాల రాజేందర్‌రావు తండ్రి జగపతి రావు కాంగ్రెస్ తరపున గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయ పరిణామ క్రమంలో రాజేందర్‌రావు బీఆర్‌ఎస్, ప్రజారాజ్యం పార్టీల్లో చేరి కీలకపాత్ర పోషించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు కార్ దిగి కాంగ్రెస్‌లో చేరి యాక్టివ్ అయ్యారాయన. వెలిచాల విషయంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొన్నం కూడా సుముఖంగా ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాయి పార్టీవర్గాలు. కానీ… అక్కడే అసలు కథ మొదలైందంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఆశించి భంగపడిన ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట… హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇస్తే పొన్నంకు చెక్‌పెట్టినట్టు… టికెట్ విషయంలో తమ మాట నెగ్గినట్టు కూడా ఉంటుందన్నది శ్రీధర్ బాబు ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పొన్నం కాస్త అసహనంగా ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామ క్రమంలో…పొన్నం ప్రభాకర్ మాత్రం ఓ అడుగు ముందుకేసి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలను, ఇంచార్జ్‌లను ఏకతాటిపైకి తెచ్చి వెలిచాలకు అనుకూలంగా పావులు కదుపుతున్నారట. తొలుత మార్చి 24న ప్రకటన వస్తుందని, ఆ తర్వాత 31న ఖరారు చేస్తారని ప్రచారం సాగినప్పటికీ …. ఎంపిక ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో పెద్దగా సంక్లిష్టత లేని సీటును ఎందుకు ఆపారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఓవైపు ప్రత్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుపంటే… అధికారంలో ఉన్న తాము అభ్యర్థినే ఎందుకు ఎంపిక చేసుకోలేకపోతున్నామన్న అసహనం పార్టీ నాయకుల్లో పెరుగుతున్నట్టు తెలిసింది. ఇద్దరు ఆశావహుల వెనక ఇద్దరు మంత్రులు ఉండి తమదైన శైలిలో పావులు కదుపుతుండటమే అసలు సమస్య అన్న వాదన బలపడుతోంది. ప్రవీణ్‌రెడ్డి టికెట్ త్యాగం చేసిన సమయంలో అతనికి ఎంపీ టికెట్ ఇస్తామని మాటిచ్చాం కాబట్టి తప్పదనే వాదన శ్రీధర్ బాబు చేస్తుండగా….. గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, వెలిచాల సరైన అభ్యర్థి అంటూ అసెంబ్లీ ఇంచార్జీలతో చెప్పిస్తున్నారట మంత్రి పొన్నం. మినిస్టర్స్ మధ్య కనిపించకుండా సాగుతున్న ఆధిపత్య పోరుకు ఎంపీ టికెట్ ఆయుధంగా మారిందనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు పార్టీ పెద్దలు ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఓ ప్లాష్ సర్వే చేయించారట… వెలిచాల రాజేందర్‌రావు, ప్రవీణ్‌రెడ్డి పేర్లతో నిర్వహించిన ఈ సర్వే రిపోర్ట్ వెలిచాల వైపు మొగ్గినట్టు సమాచారం. ఈ సర్వే ఆధారంగా టికెట్ ప్రకటించండని పొన్నం హైకమాండ్‌తో అన్నట్టు సమాచారం. దీంతో మంత్రుల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం చివరికి అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని ఎట్నుంచి ఎటు మలుపు తిప్పుతుందోనన్న టెన్షన్ పెరుగుతోంది కేడర్‌లో.