కడపలో క్యాష్ ఆఫర్స్ కళ్ళు చెదిరిపోతున్నాయా? తమకు అంత డిమాండ్ వస్తుందని ఆ జడ్పీటీసీలు కూడా ఊహించలేకపోయారా? చివరికి సొంత పార్టీ సభ్యులకే వైసీపీ సొమ్ములు ముట్టజెప్పుకోవాల్సి వస్తోందా? క్యాంప్ పాలిటిక్స్, క్యాష్ ఆఫర్స్‌తో కడప రాజకీయం రక్తి కడుతోందా? ఒక్కో జడ్పీటీసీ ఎంత రేటు పలుకుతున్నారు? ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈనెల 27న జగరనుంది. ఖాళీ అయిన ఈ పోస్ట్ కోసం ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. జడ్పీలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా వైసీపీ నుంచి వలస వచ్చిన సభ్యుల సాయంతో పీఠాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటోందట. జగన్ అడ్డాలో తమ వాళ్ళని కాపాడుకునేందుకు వైసీపీ కూడా గట్టి ప్రయత్నాలు చేయడంతో క్యాంప్ పాలిటిక్స్‌కు తెర లేచింది. తమ సభ్యులందర్నీ వైసీపీ ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ తరలించినట్టు తెలిసింది. అటు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న జడ్పిటిసిలకు టీడీపీ భారీగా నగదు గాలం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక్కో సభ్యుడికి 25 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.నియోజకవర్గ స్థాయి లీడర్లకు సైతం జడ్పీటీసీలతో వస్తే కూటమిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. ఆ క్రమంలోనే బద్వేల్ నియోజకవర్గంలో ఓ నేతకు రెండు కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. బద్వేల్ వైసీపీ ఇన్చార్జి పై అసంతృప్తిగా ఉన్న ఆ నేత ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారట. కనీసం ముగ్గురి కోసం ఆయన బేరమాడుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీని వీడి ఆరుగురు జడ్పిటిసిలు కూటమిలో చేరారు. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో సీటు ఖాళీ అయింది. చైర్మన్ పదవితో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి పదవికి ఆయన రాజీనామా చేశారు. పులివెందుల జడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రెండు సీట్లు కూడా ఖాళీ అయ్యాయి. ఉమ్మడి కడపలో మొత్తం 50 జెడ్పిటిసి స్థానాలు ఉండగా 49 వైసీపీ,ఒక్కటి టీడీపీకి దక్కాయి.
ఖాళీ అయినవి, ఇప్పటికే కూటమి వైపునకు దూకేసిన వాళ్ళని మినహాయిస్తే…ప్రస్తుతం ఇక్కడి వైసీపీ బలం 40 మంది సభ్యులు. ఇందులో పది నుంచి 12 మంది వైసీపీపై అసంతృప్తితో ఉన్నారట. ఎన్నిక దగ్గర పడుతున్నందున అలర్ట్ అయిన టీడీపీ ఆ అసంతృప్త సభ్యులకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోకి వస్తే డబ్బుతో పాటు మండల స్థాయిలో పనులు కూడా ఇస్తామని ఆఫర్ మీద ఆఫర్లు ఇస్తున్నారట. విషయం తెలుసుకున్న వైసీపీ కూడా మేమేం తీసిపోబోమన్నట్టుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. అవడానికి తమ పార్టీ జడ్పీటీసీలే అయినాయ….ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అడ్వాన్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. టిడిపి రేటు ప్రకటించిన తర్వాత దానికి మించి ఇస్తామని హామీ ఇస్తున్నట్టు సమాచారం. పలు కాంట్రాక్ట్ పనులు సైతం మంజూరు చేయాలని ఇన్చార్జి జడ్పీ చైర్మన్ ను వైసిపి నేతలు ఆదేశించారట. అటు టీడీపీ కూడా జగన్ ఇలాకాలో జడ్పీ చైర్మన్ పదవి కొట్టి ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. తొలిసారి జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్నందున అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే… జిల్లా పరిషత్ తమ అధీనంలో ఉండాలని భావిస్తున్నారట టీడీపీ నాయకులు. అందుకే వైసీపీ అసంతృప్తుల కోసం గట్టిగా వల విసురుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవైపు క్యాంప్ పాలిటిక్స్, మరోవైపు ఆఫర్స్ మీద ఆఫర్స్‌తో చివరికి కడప జడ్పీ ఎవరి ఖాతాలో పడుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.