అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరుతోంది. ఎమ్మెల్యే మాధవి వర్సెస్ అదర్స్‌గా ఉందట వ్యవహారం. ఒకటి ఎమ్మెల్యే లోకం మాధవి అండ్ కో ఒక వర్గం కాగా…. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు యశస్విని, పడాల అరుణ, గుర్రాన అయ్యలు కలిసి మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారట. పేరుకు ఒకే పార్టీ అయినా… ఏ విషయంలోనూ రెండు వర్గాలకు పొంతన కుదరడంలేదని చెప్పుకుంటున్నారు. మాధవి ఎమ్మెల్యేగా గెలిచాక విష్ చేయడానికి ఈ ముగ్గురిలో ఒకరు అలవెళ్ళి ఇలా వచ్చేస్తే…. ఇంకో ఇద్దరు ఆ పని కూడా చేయలేదట. దీన్నిబట్టే వర్గ పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ కేడరే అంటున్న పరిస్థితి. ఈ గ్రూప్ రాజకీయాలు జిల్లాలో జనసేన మనుగడకు ముప్పు తెచ్చేలా ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నా… నాయకులలో మాత్రం చలనం లేదట. ఎమ్మెల్యే మాధవి చేరికల మీద దృష్టి పెడితే… మిగతా ముగ్గురూ వెనక్కి లాగుతున్నారట. ఎక్కడ తమకు ప్రాధాన్యం తగ్గుతుందోనని అలా వ్యవహరిస్తున్నారన్నది కేడర్ డౌట్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేనకు కేడర్ బలం ఉన్నా….అందర్నీ కలుపుకుని ముందుకు నడిపించే నాయకుడు కరవైందని జనసైనికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఇప్పుడు ఈ గ్రూపులతో నలిగిపోతున్నారట. అధినేత ఆదేశాలను లక్ష్మణరేఖగా పాటించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నా…దురదృష్టవశాత్తూ ఈ గ్రూపుల కారణంగా సంస్థాగత నిర్మాణం జరగడంలేదన్నది కొందరి మాట. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయిందని అంటున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం జిల్లా నుంచి ఎమ్మెల్యే మాధవిని పార్లమెంటరీ ప్రతినిధిగా నియమించింది అధిష్టానం. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్లీనరీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌కు రావాలని ఎమ్మెల్యే మాధవి అన్ని నియోజకవర్గాల నాయకులకు సమాచారం అందించారట. అలాగే వ్యతిరేక గ్రూప్ నాయకులకూ సందేశం పంపినా… ఆ ముగ్గురూ డుమ్మాకొట్టారట. దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులే ఇలా వ్యవహరిస్తే ఎలాగని ఆ మీటింగ్‌లోనే నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ నిర్ణయాలను పక్కకు పెట్టి సొంత ఎజెండా ప్రకారం వెళ్ళడం ఏంటని మిగతా నాయకులు గట్టిగానే ప్రశ్నించినట్టు తెలిసింది. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌కు కూడా ఆ ముగ్గురి తీరుపై ఫిర్యాదులు చాలా వెళ్ళాయట. వాళ్ళు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోగా, నిజాయితీగా పనిచేసే వాళ్ళను నిరాశకు గురిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇది ఇలాగేకొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదమన్న అభిప్రాయం పెరుగుతోంది. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేకి, మిగతా నేతలకు మధ్య పెరిగిన అగాధాన్ని పూడుస్తారా? లేక మీలో మీరు కొట్టుకు చావండి…. ఫైనల్‌గా ఎవరికి పైచేయి అయితే వాళ్లే మా వాళ్ళని తమాషా చూస్తూ ఉంటారా అన్నది తేలాలంటున్నారు పరిశీలకులు.