మనం సీన్‌లో అన్నా ఉండాలి, లేదా సినిమా మొత్తం మన చుట్టూనే తిరుగుతూ ఉండాలని ఆ సీనియర్ ఐఎఎస్ అనుకుంటున్నారా? అందుకే అనవసరమైన వివాదాల్ని కెలుక్కుని మరీ తెర మీద ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి సందర్భంలో ఆమె అత్యుత్సాహం ఏదో ఒక వివాదానికి దారి తీస్తోందా? తన పోస్ట్‌కు తగ్గ హుందాతనాన్ని ప్రదర్శించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఐఎఎస్ ఎవరు? ఏంటా వ్యవహారం? స్మితా సభర్వాల్…. సీనియర్ ఐఏఎస్. బీఆర్‌ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిపోయిన ఈ ఆఫీసర్… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాన్ ఫోకల్ పోస్టులో కొనసాగారు. ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ ఫోకల్ పోస్టు కేటాయించింది. అయితే… స్మిత.. కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారా? లేక అవే ఆమెను చుట్టు ముడుతున్నాయా అన్నది ప్రస్తుతం అర్థంకాని పరిస్థితి. తెలంగాణ సీనియర్ ఐఏఎస్‌లు అందరికంటే ఎక్కువగా స్మిత సోషల్ మీడియాను వాడుతుంటారన్న పేరుంది. ఇటీవల ఆమె ఓ ఎక్స్ మెసేజ్‌కు రియాక్ట్ అవడం పోలీసు నోటీసులదాకా వెళ్ళింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మెసేజ్‌కు సంబంధించి… గచ్చిబౌలి పోలీసులు ఈ టూరిజం సెక్రెటరీకి నోటీసులు జారీ చేశారు. ఫేక్, ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్ మీద నమోదైన అభియోగం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మిస్ వాల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కీలకంగా ఉన్నారు స్మిత. అది ప్రతిష్టాత్మ ఈవెంట్ కావడం, పైగా టూరిజం సెక్రెటరీగా ఉండి బయట ఫోకస్డ్ పొజిషన్ కావడంతో… ఆమె పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకుంది రేవంత్ సర్కార్. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు ట్వీట్స్‌తో వివాదాస్పదం అయ్యారామె. ఐఏఎస్‌గా ఎంపికయ్యే వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని, కాళ్లు చేతులు సక్రమంగా ఉండాలంటూ… చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది.
సాటి ఐఎఎస్‌లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఇక ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సభర్వాల్ వాహనానికి చెల్లింపులు చేయడాన్ని ఆడిట్ అధికారులు తప్పు పట్టారు. తొమ్మిదేళ్ళలో దాదాపు 61లక్షల రూపాయల్ని స్మితా వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం కూడా నోటీసులదాకా వెళ్ళింది. కానీ… ప్రభుత్వ ఉన్నతాధికారిగా పని చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వైఖరిపై ప్రభుత్వ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేకపోతే… ఆమె పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట అధికార వర్గాల్లో. చిన్న చిన్న ఉద్యోగులు తెలిసీ తెలియక తప్పులు చేస్తే… సస్పెన్షన్లు, డిస్మిస్ చేసే ఉన్న అధికారులే ఇలాంటి పనులు చేస్తే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు. గత ప్రభుత్వంలో అంతా తానై నడిపించిన స్మితా.. ప్రస్తుతం ఉనికి చాటు కునేందుకే ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అయినా… వివాదాలు స్మితకు కొత్త కాదని, ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకు తిరగడం ఆమెకు అలవాటే అని ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు చర్చించుకుంటున్నారట. సీనియర్ ఐఎఎస్‌లు సాధారణంగా…. పేద ప్రజలకు సహాయం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకువెళ్ళడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం లాంటి పనులు చేస్తుంటారు. కానీ…. అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకుని వివాదాస్పదం చేయడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో… కంచ గచ్చిబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్‌కు రియాక్షన్‌గా పోలీసులు నోటీసుతోనే సరిపెడతారా? లేక అంతకు మించి ముందుకు వెళతారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.