జీహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలన్న ఊపులోనే బీఆర్‌ఎస్ ఉందా? నాలుగేళ్ళ గడువు ముగిసింది గనుక ఇక పావులు కదుపుతుందా? ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్‌ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రాజకీయ ప్రత్యర్థుల సహకారం లేకుండా సాధ్యమవుతుందా? బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతిస్తుందా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నికల్‌గా అవిశ్వాసం సాధ్యమేనా? గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మాన చర్చ నెల రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున మేయర్ పదవి తీసుకున్న గద్వాల విజయలక్ష్మి, రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం పోగానే.. కండువా మార్చేసి కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోయారంటూ గుర్రుగా ఉన్నారు గులాబీ కార్పొరేటర్స్. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించుతామని శపధం చేశారు. కానీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే పదవీ కాలం నాలుగేళ్లు ముగియాలి. ఆ నిబంధన అడ్డంకితోనే ఇన్నాళ్ళు ఆగారట బీఆర్‌ఎస్ నేతలు. కానీ.. తాజాగా ఆ గడువు ముగిసిపోయింది. గ్రేటర్ పాలకమండలి ఏర్పాటై… నాలుగేళ్ళు ముగిసిపోవడంతో… మరోసారి అవిశ్వాసం వ్యవహారం తెర మీదికి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్స్ ఉండగా…అందులో ఇద్దరు కార్పొరేటర్స్ చనిపోయారు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ప్రస్తుతం 146 మంది సిట్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కలిపి ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా 50 మంది ఉన్నారు. ఇలా అన్నీ కలిపి.. 196 ఓట్లున్నాయి జీహెచ్‌ఎంసీ పాలక మండలిలో. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే… కనీసం సగం సభ్యుల సపోర్ట్ కావాలి. అది నెగ్గాలంటే సభలో 2/3… అంటే 131 మంది సభ్యుల బలం కావాలి. కానీ… ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 40 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి…. మొత్తం 69 మంది బలం మాత్రమే ఉంది. తీర్మానం నెగ్గే సంగతి తర్వాత…కనీసం ప్రవేశపెట్టడానికి కూడా ఆ స్ట్రెంగ్త్ సరిపోదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉండవచ్చంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. కథలో ఊహించని మలుపులు ఉంచవచ్చంటున్నారు.
అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మాకు బీజేపీ సపోర్ట్ చేస్తుందంటూ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారట బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్. దాని చుట్టూనే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫిషియో మెంబెర్స్ కలిపి మొత్తం 47 మంది ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. కానీ… నెగ్గాలంటే మాత్రం టూ థర్డ్ మెజారిటీ తప్పనిసరి. అంటే.. 131 మంది కావాలి. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మొత్తం సంఖ్య 115కే పరిమితం అవుతోంది. మరో 16 మంది సభ్యుల సపోర్ట్ అనవసరం అవుతుంది. ఇక్కడే ఎంఐఎం పాత్ర కీలకం. 41 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్న మజ్లిస్ పార్టీ మాతోనే ఉందన్న ధీమా కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ BRS, BJP కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా సంఖ్యా బలం లేక వీగిపోతుందనే నమ్మకంతో ఉన్నారట మేయర్, డిప్యూటీ మేయర్. ప్రజా సమస్యలు పక్కన బెట్టి పొలిటికల్ గా మైలేజ్ పెంచుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు.. కనీస బలం లేకుండా అవిశ్వాసం గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మరో చర్చా మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో బీఆర్‌ఎస్ అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తుందా అన్నది ఎక్కువ మంది డౌట్. ఇటీవల బీజేపీ హెడ్ ఆఫీస్‌లో కార్పొరేటర్స్‌తో సమావేశం అయ్యారట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఒకవేళ బీఆర్‌ఎస్ బలం లేకుండా తీర్మానం పెట్టినా మనం సపోర్ట్ చేయొద్దని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బీఆర్‌ఎస్ కూడా తగ్గితే బెటరని ఇంటర్నల్‌గా అనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. టెక్నికల్‌గా అవిశ్వాసం అన్నది సాధ్యం కాకున్నా… రాజకీయ కోణంలో… ఓ ట్రయల్ వేసి చూద్దామని కారు పార్టీ అనుకుంటుందా? లేక అనువుగాని చోట అధికులమనరాదన్న పద్యాన్ని అర్ధం చేసుకుంటుందా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. బీఆర్‌ఎస్ వైఖరి తేలాలంటే… ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.