తెలంగాణ ముఖ్యమంత్రిని హుటాహుటిన ఢిల్లీ పిలిపించుకున్న ప్రధాని మోడీ ఏం చేశారు? రాష్ట్రానికి నిధుల కోసం వెళ్ళిన సీఎంకి ప్రధాని ఏమిచ్చారు? ఆ మీటింగ్ జరిగిన తీరు చూసి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్‌లకు సైతం ఎందుకు మైండ్ బ్లాంక్ అయింది? రేవంత్ ఆశించిందేంటి? మోడీ ఇచ్చిందేంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. ప్రధానమంత్రి మోడీతో అరగంటకు పైగా సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కూడా ఇలా సమావేశమైనా…ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా జరిగిందని అంటున్నారు. తెలంగాణకు ప్రస్తుతం… కేంద్రం ఇస్తున్న నిధులు, సహకారంపై ఇటీవల కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదంటూ టార్గెట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఇటీవలి కాలంలో తెలంగాణపై ఫోకస్ పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, ఇతర కేటాయింపులపై సీఎం ప్రజల్లో చర్చ పెట్టే ప్రయత్నంలో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే… సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు ప్రధాని. అయితే…ఈ భేటీ వెనక ఎవరి రాజకీయ ఎత్తుగడల్ని వాళ్ళు అమలు చేసే స్కెచ్ ఉందన్న చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే.. మూసీ పునరుద్ధరణకి నిధులు ఇవ్వాలని అడిగారు సీఎం.
పెండింగ్‌లో ఉన్న ఐపిఎస్ అధికారుల కేటాయింపును వెంటనే పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగబోతున్నందున కేంద్రం నుండి మద్దతు కోరారాయన. అయితే అదంతా వన్‌సైడ్. మరోవైపు ఏకంగా ప్రధానమంత్రే ముఖ్యమంత్రికి రివర్స్‌లో వినతిపత్రం ఇవ్వడం నిజంగా షాకింగేనంటున్నారు పొలిటికల్ పంటిట్స్. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా… తమ రాష్ట్రానికి ఏం కావాలో చెబుతూ వినతిపత్రాలు ఇచ్చి వస్తుంటారు. కానీ… ఫస్ట్‌టైం ప్రధాని ఒక సీఎంకు రివర్స్‌లో వినతి పత్రం ఇవ్వడం చూసి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్‌లు సైతం నివ్వెరపోయిన పరిస్థితి. ఐదారు అంశాలకు సంబంధించి వినతిపత్రం ఇచ్చారట మోడీ. 2016 నుంచి… ప్రధాని అవాస యోజనకి సంబంధించి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయమని కోరారు మోడీ. ప్రాజెక్టుల భూసేకరణలో పెండింగ్ నిధులు వివరాలు కూడా ఇచ్చారాయన. భువనగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి పెండింగ్‌లో ఉన్న 13 వందల కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారట. రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను రేవంత్ దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిసింది. ఇలా పరస్పర వినతులతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. గతంలో బీఆర్‌ఎస్ హయాం నుంచి కేంద్రానికి చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన బకాయిలు వివరాలన్నిటినీ స్వయంగా ప్రధాన మంత్రి సీఎం ముందు ఉంచడంతో…ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెండింగ్ నిధుల ఎపిసోడ్‌లో ఎవరి ఎత్తుగడ వారిది అన్నట్టుగా కనిపిస్తుండటం పొలిటికల్‌గా రక్తి కడుతోంది.