తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? పక్కా సమాచారంతోనే అన్నారా? లేక ఓ రాయి వేసి చూద్దామనుకున్నారా? ప్రభుత్వంలో గులాబీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారన్నది నిజమేనా? కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే ఒకరిద్దరు మంత్రులు నేరుగా ప్రతిపక్ష ముఖ్యుడికి ఫోన్ చేసి చెబుతున్నారన్నది నిజమేనా? అసలు తెలంగాణ సర్కార్‌లో ఏం జరుగుతోంది? రేవంత్ ఏమన్నారు? సీఎల్పీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ విషయంలో సాఫ్ట్ కార్నర్ అక్కర్లేదని అనడం వెనక ఏదో…… ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మామూలుగా అయితే… రేవంత్‌రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసే టైప్ కాదని, ఇప్పటివరకు చేయలేదని గుర్తు చేస్తున్నారు కొందరు. కానీ… ఇప్పుడు సీఎల్పీ మీటింగ్‌లో అలా మాట్లాడారంటే…. తనకున్న సమాచారంతో….కొంతమంది నాయకులను ఉద్దేశించి అని ఉంచవచ్చన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం విషయంలో మౌనంగా ఉంటున్నారన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేదంటే ఇంటిలిజెంట్స్ ఇచ్చిన పక్కా నివేదికలతోనే గులాబీ సాఫ్ట్ కార్నర్ లీడర్స్‌ని పరోక్షంగా హెచ్చరించారా అన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు సైతం ఆంటీ ముట్టనట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారన్న అభిప్రాయం ఉందట. ఏదో…నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగా పని చేసుకోవాలని భావించేవారికి సంబంధించి సీఎం దగ్గర నివేదిక ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మీద, పార్టీ మీద విమర్శలు వచ్చినా… కొంతమంది స్పందించేందుకు నిరాకరిస్తున్నారట. అది నా పని కాదులే అని వదిలేసుకుంటున్నారట. రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజ్ వచ్చినప్పటి నుంచి అందర్నీ అలెర్ట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో… సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్నాళ్లు కాస్త చూసీ చూడనట్టు ఉన్నా ఇకపై దూకుడుగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అందులో భాగంగానే… ప్రతిపక్షం విషయంలో సానుకూలంగా ప్రవర్తించే ఎమ్మెల్యేలు, మంత్రులైనా సరే….కఠినంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. కొంతమంది మంత్రుల వ్యవహారం మీద ముఖ్యమంత్రి బాగా అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. క్యాబినెట్లో జరుగుతున్న చర్చలను ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతకు ఒకరిద్దరు మంత్రులే నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కొందరు అధికారులు కూడా ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రతిపక్షానికి చేరవేస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఇదే అంశాన్ని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఓపెన్ గానే చెప్పేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ఎమ్మెల్యేలను అటు మoత్రులను మీరేం చేస్తున్నారో మాకు తెలుసన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చేలా సీఎం అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చంటున్నారు. అలాగే సీఎల్పీ మీటింగ్‌లో జానారెడ్డి కుమారుడుకి క్లాస్ పీకడం కూడా చర్చలో భాగమైంది. జానారెడ్డి కుటుంబం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. అలాంటి జై వీర్‌నే మందలించారంటే… మిగిలిన వారికి కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఇండికేషన్స్ ఇచ్చారన్న చర్చ నడుస్తోంది. సొంత పార్టీలో నాయకులని కంట్రోల్ చేయడంతో పాటు అలాంటి ప్రవర్తన ఉన్నవారిని హెచ్చరించడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చంటున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి మాటలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. వాటి అంతరార్ధాన్ని తెలుసుకుని సదరు గులాబీ సాఫ్ట్ లీడర్స్ మారతారో లేక, మారలేదని డిసైడ్ చేసుకుని సీఎం చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు.