ఆ నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయా? కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు హత్యలదాకా వెళ్ళిందా? పొలిటికల్ పైచేయి కోసం ఖద్దర్, ఖాకీ ఒక్కటయ్యాయా? చనిపోయిన నాయకుడు, చంపినట్టు ఆరోపణలున్న నాయకుడు సొంత మామా అల్లుళ్ళే అయినా….. పొలిటికల్ పవర్ ముందు బంధం బలాదూర్ అయిందా? ఎక్కడ జరిగిందా హత్య? కాంగ్రెస్‌ని ఎలా షేక్ చేస్తోంది? సూర్యాపేట జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ హత్య హస్తం పార్టీలో కుంపటి రాజేసింది. అది పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా అంటుకోవడం మరింత కలకలం రేపుతోంది. ఆ హత్య తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల కాంగ్రెస్ నేతల మధ్య అగ్గి రాజేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్‌ను ఈనెల 17న హత్య చేశారు. చక్రయ్య గౌడ్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు అత్యంత సన్నిహితుడు. గౌడ్‌ను ఆయన సొంత అల్లుడే దారుణంగా హత్య చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మామ, అల్లుళ్ళ మధ్య రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగిందనేది తుంగతుర్తి టాక్. ఇద్దరు బీఆర్ఎస్ ఉన్నప్పుడే వర్గపోరు ముదిరి పాకానపడిందట. దీంతో చక్రయ్య గౌడ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక పార్టీ అధికారంలో వచ్చాక తాను కూడా హస్తం గూటికి చేరేందుకు గట్టి ప్రయత్నాలే చేశారట చక్రయ్య అల్లుడు కమ్ నూతనకల్ పీఏసీఎస్ చైర్మన్ కనుకటి వెంకన్న. కానీ ఎమ్మెల్యే సామేల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఆశ్రయించారట వెంకన్న. అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించిన సదరు కాంగ్రెస్ పెద్దలు… కొద్దికాలం వెయిట్ చేయించి.. కామ్‌గా కనకటి వెంకన్నకు పార్టీ కండువా కప్పేశారట. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు ఫైరైపోయినట్టు సమాచారం. సదరు కాంగ్రెస్ నేతలతో వెంకన్న అంతా సెట్ చేసుకొని… హస్తం పార్టీ కండువా కప్పుకున్నారని అప్పట్లో గట్టిగానే వినిపించింది.
ఆ ఎపిసోడ్ తర్వాత…. మిర్యాల గ్రామంలో మళ్లీ రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది. అందులో భాగంగానే చక్రయ్య హత్య జరిగినట్టు చెప్పుకుంటున్నారు. కొందరు పార్టీ కీలక నేతల సపోర్ట్ దొరకడంతోనే…వెంకన్న వర్గం చక్రయ్యను హత్య చేసిందన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. మాజీ సర్పంచ్ హత్య విషయం కొందరు నాయకులకు ముందే తెలుసునని, అంతా వారి కనుసన్నుల్లోనే జరిగిందని తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌తో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కూడా పరోక్షంగా సూర్యాపేట నాయకుల్నే వేలెత్తి చూపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తన నియోజకవర్గంలో హత్య జరిగిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళిన మందుల సామేల్… న్యాయం చేయాలని కోరారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తుంగుర్తి సీఐ, సూర్యాపేట డీఎస్పీ పై వేటు వేశారు. నిందితుల అరెస్ట్‌లు కూడా చకచకా జరిగిపోయాయి. చక్రయ్య హత్య తరువాత నిందితులు పోలీసులకు దొరకడం వెనక సూర్యాపేట హస్తం పార్టీ నేతల పాలిట్రిక్స్ ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిందితులను రక్షించడానికి కొందరు కీలక కాంగ్రెస్ నేతలు పోలీసు అధికారికి పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారని, ఆ ఆఫర్ లో భాగంగానే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ముట్టిందని… ఇటు పోలీస్ శాఖ, అంటు కాంగ్రెస్ పార్టీలోనూ చెప్పుకుంటున్నారు. ఈముచ్చట పోలీసు ఉన్నతాధికారుల ద్రుష్టికి కూడా వెళ్లిందట. అయితే తీవ్ర ఆరోపణలతో డీజీపీ ఆఫీస్ కు తాత్కాలికంగా అటాచ్ అయిన డీఎస్పీని తిరిగి సూర్యాపేటకు రప్పించేందకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు మళ్ళీ కలకలం రేపుతున్నాయి. మొత్తంగా మాజీ సర్పంచ్ హత్య రెండు నియోజవర్గాల కాంగ్రెస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోయిన పోలీస్ అధికారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.