Off The Record: బీఆర్‌ఎస్‌ని ఆషాడం ఆదుకుంటోందా? ఆ పార్టీ అధిష్టానం హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటోందా? ఆషాఢం పేరుతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే స్కెచ్ సిద్ధం చేసుకుంటోందా? ఆ దిశగా పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? గులాబీ పెద్దల మనోగతం ఎలా ఉంది?
పవర్ పోయాక మొదలైన ఎమ్మల్యేల జంపింగ్స్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్‌ఎస్ అధిష్టానం. రోజుకొకరు చొప్పున కారు దిగేస్తూ కంగారు పుట్టిస్తున్నారు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్‌తో మొదలైన చేరికల పర్వానికి ఇప్పుడు ఆషాఢం పేరుతో చిన్న బ్రేక్ పడింది. ఇప్పటికి మొత్తం పది మంది గులాబీ శాసనసభ్యులు కాంగ్రెస్ గూటికి చేరిపోగా… ఇంకో పది మంది రెడీగా ఉన్నారని, అసలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపు బీఆర్‌ఎస్ లెజిస్టేచర్ పార్టీనే సీఎల్పీలో విలీనం చేస్తారన్న ప్రచారం సైతం జరిగింది. దీంతో తీవ్ర వత్తిడికి లోనైందట బీఆర్‌ఎస్ అధిష్టానం. పదేళ్ళు పవర్‌లో ఉండి ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు వలసపోతున్న సొంత నేతల్ని కాపాడుకోలేక కకావికలం అవుతోందన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. రోజుకొకరు కారు జారిపోతూ… ఏం చేయాలో పాలుపోని స్థితిలో… వలసలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నా… చర్చలు పూర్తయ్యేసరికి ఆషాఢం అడ్డొచ్చింది. దీంతో ప్రస్తుతం మంచి రోజులు కావంటూ… తాత్కాలికంగా ఆగిపోయారట కొందరు ఎమ్మెల్యేలు. ఎలాగూ పార్టీ మారాలని ఫిక్స్ అయ్యాం. వెళ్తోంది అధికార పార్టీలోకే కాబట్టి… అంతా బాగుండాలంటే… మంచి రోజులు చూసుకొని అటువైపునకు అడుగు పెట్టడం బెటరన్న ఉద్దేశ్యంతో ఇప్పుడో చిన్న బ్రేక్ అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బ్రేకే ఆశా జ్యోతిలా కనిపిస్తోందట బీఆర్ఎస్ పెద్దలకు. వాళ్ళు ఆగిపోయిన కారణం ఏదైనా… బుజ్జగించుకోవడానికి మనకు మంచి టైం దొరికిందని లోలోపల ఆనందిస్తూ…. థ్యాంక్స్ టు ఆషాఢం అంటున్నారట గులాబీ పెద్దలు.
పార్టీ వీడాలనుకున్న వాళ్లతో తీరిగ్గా చర్చలు జరిపి గతాన్ని గుర్తు చేయడంతో పాటు…. భవిష్యత్‌లో ఎలా ఉంటుందో వివరించి నమ్మకం కలిగించవచ్చన్నది తెలంగాణ భవన్ వర్గాల నమ్మకంగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వాళ్ళకు మరో వెసులుబాటు కూడా దొరికిందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కూడా కావడంతో… ప్రస్తుతం చేరికలన్నీ ఆయన సమక్షంలోనే జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఆయనతో కండువా కప్పించుకుంటారోనని ఇన్నాళ్ళు టెన్షన్ పడుతున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. కానీ… ఇప్పుడు సీఎం అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్ట్ 3 నుంచి 11 వరకు ఆ పర్యటనలో ఉంటారు ముఖ్యమంత్రి. ఇటు ఆషాఢం, అటు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోవడం లాంటి రెండు సందర్భాలను ఉపయోగించుకుంటూ… ఈ గ్యాప్‌లో తమ ఎమ్మెల్యేల మనసు మార్చుకోవాలని గులాబీ పెద్దలు ఆశగా ఉన్నట్టు తెలుస్తోంది. పోయిన వాళ్ళు పోయారు. ఇక మిగిలి ఉన్నవాళ్ళనైనా గట్టిగా కాపాడుకోగలిగితేనే పరువు నిలబడుతుందని, అలా కాకుండా… బయట ప్రచారం జరుగుతున్నట్టు సింగిల్ డిజిట్‌కు పరిమితం అయితే చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన ఉందట బీఆర్‌ఎస్ పెద్దల్లో. అందుకే రెండు రూపాల్లో అందివచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోకుండా వెంటనే జంపింగ్ లిస్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల బ్రెయిన్ వాష్ ప్రోగ్రాం పెట్టాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. రాబోయే 20 రోజులు తమ పార్టీకి అత్యంత కీలకం అని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో ఉన్న ఎల్బీనగర్, జహీరాబాద్ ఎమ్మెల్యేలను కేటీఆర్ వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గులాబీ పెద్దల ఈ మనసు మార్చుడు కార్యక్రమం ఎంత వరకు సక్సెస్ అవుతుందో… వెళ్ళాలనుకున్న వాళ్ళలో ఎంత మందిని ఆపుతారో చూడాలి మది.