కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ వచ్చినా…. టీడీపీకి గుర్తింపు ఉంటుందా? ఆ పార్టీ అనుకున్నట్టుగా పరిణామాలు ఉంటాయా? అసలు కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామి అవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి? అసలు ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసే ఏపీలోఎన్నికలకు వెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏలో చేరిన టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్రంలో మళ్లీ వచ్చేది మోడీ సర్కారేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇలాంటి వాతావరణంలో జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే…. అందులో టీడీపీ పాత్ర ఎలా ఉంటుందన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట ఏపీ రాజకీయ వర్గాల్లో. తెలుగుదేశం నేతలు ఆశిస్తున్నట్టుగా…కేంద్ర ప్రభుత్వంలో ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుందా? కేంద్రం సహకారం ఏ మేరకు ఉండవచ్చన్న అంశాలపై రకరకాల విశ్లేషణలు బయలుదేరాయి. ఆలు లేదు చూలు లేదు ఇప్పుడే అలాంటి చర్చ ఎందుకయ్యా అంటే… అందుకూ కారణాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
ఒకవేళ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా… ప్రస్తుతం టీడీపీ-జనసేన కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కేంద్రం సాయం తప్పనిసరి. అక్కడ నట్లు బిగిస్తే… ఇక్కడ సైకిల్ ముందుకు కదల్లేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరెన్ని హామీలు ఇచ్చినా… ఎంత ఆకర్షణీయంగా చెప్పినా… ఢిల్లీ సహకారం లేనిదే ఏం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ చర్చ ముందుకు వచ్చిందంటున్నారు పరిశీలకులు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోకు మా మద్దతు ఉందని బీజేపీ పైకి చెబుతున్నా.. ఆ పార్టీ తీరు చూస్తుంటే…. అంటీ ముట్టనట్టుగా ఉండే సూచనలే కన్పిస్తున్నాయని అంటున్నాయి రాజకీయ వర్గాలు.. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ అభిప్రాయం బలపడుతోందట. ఈ క్రమంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో అమలు చేయడం అంత ఈజీ కాదని, అదంతా ఉత్తుత్తి వ్యవహారం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందట వైసీపీ. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉందనే ప్రచారాన్ని ఓ రేంజ్‌లో చేస్తున్న ఫ్యాన్ పార్టీ…తాజాగా.. రేపు కేంద్రంలో మళ్ళీ ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ పాత్ర ఏంటనే అంశాన్ని చర్చకు తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టో.. బీజేపీ వైఖరిని ప్రస్తావిస్తూ….రేపు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి అంత సీన్ ఏమీ ఉండదన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటోందట వైసీపీ. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన పార్టీల్లో మరో చర్చ జరుగుతోందట. ఎన్డీఏలో అతి ముఖ్యమైన, కీలక భాగస్వామిగా టీడీపీ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న పార్టీల్లో కూడా టీడీపీనే పెద్ద పార్టీ అని చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే… మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వస్తే…చంద్రబాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్న విషయాన్ని ప్రచారంలో పెట్టబోతోందట టీడీపీ. ప్రచారం జరుగుతున్నట్టుగా… బీజేపీకి సొంత మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. టీడీపీకి ఇంపార్టెన్స్ కచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నారట ఆ పార్టీ నేతలు. ఒకవేళ ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజార్టీ రాని పక్షంలో ఇతర పార్టీలను ఎన్డీఏ గొడుగు కిందకు తీసుకురావడంలో చంద్రబాబు.. టీడీపీ పాత్రే కీలకమవుతుందన్న వాదనను కూడా ప్రచారంలో పెడుతోందట టీడీపీ. ఈ క్రమంలో ఏ విధంగా చూసినా.. ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎవరి వాదనను వారు బలంగా ముందుకు తీసుకెళ్తుండటంతో ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా దమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.