వై నాట్ పులివెందుల అంటున్న టీడీపీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? ఈసారి ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో సీఎం జగన్‌ని ఓడించాలనుకునే పార్టీ ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది? అసలక్కడి నాయకత్వ తీరుపై టీడీపీ అధిష్టానం ఏమనుకుంటోంది? లెట్స్ వాచ్.
వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అన్నది వైసీపీ నినాదానం. దానికి కౌంటర్‌గా వైనాట్ పులివెందుల అన్నది టీడీపీ వాయిస్. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? నిజంగానే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత పట్టు పెరిగిందా అంటే ఎస్ అని చెప్పలేని పరిస్థితి. పులివెందులలో పసుపు జెండా ఎగరాలంటే ప్రతి కార్యకర్త శక్తిమేర పని చేయాలంటోంది నాయకత్వం. కానీ.. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ బిటెక్ రవి ఆ రేంజ్‌లో దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయట. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం కూడా ఆయనకు క్లాస్ పీకినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
పులివెందులలో బూత్ లెవల్ నుంచి నాయకుల పనితీరుపై నివేదికలు తయారు చేయించుకుంది టిడిపి అధిష్టానం. ఆ మధ్య రహస్య సమావేశం పెట్టి ఎవరైతే గ్రామాల్లో మెజారిటీ తెస్తారో వారికే రేపు ప్రభుత్వం వచ్చాక పదవులు ,పనులు అంటూ ఆశ పెట్టిందట. నియోజకవర్గ ఇన్చార్జి చెబితే పదవులు రావని, పనిచేస్తేనే గుర్తింపు అని క్లారిటీ ఇచ్చేశారట. వ్యక్తిగత ఘర్షణల కేసులను కూడా కొంత మంది లీడర్స్ పార్టీ ఖాతాలో వేసేసి తామేదో తెగ పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయని పులివెందుల నాయకులకు చెప్పాయట ఎన్టీఆర్ భవన్ వర్గాలు. గ్రూప్ లు కడితే సహించబోమని హెచ్చరించారని పార్టీ క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల వైసీపీ నాయకుల్లో అంసతృప్తి ఉందని, దాన్ని పసిగట్టి క్యాష్ చేసుకోవాలని క్యాడర్‌కు సూచించిందట నాయకత్వం. కార్యకర్తల సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ బిటెక్ రవికి పార్టీ పెద్దలు స్పెషల్ క్లాస్ పీకారట. చక్రాయపేట భూ తగాదా విషయంలో బిటెక్ తీరును పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. కొందరిని దగ్గరకు తీయడం, మరికొందరిని దూరం పెట్టడం లాంటివి మానుకోవాలని సూచించారట. పులివెందుల నియోజకవర్గ నాయకుల కోసం ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో మొత్తం బిటెక్ రవి బంధువులు కూర్చోవడంపై పార్టీ వర్గాల్లో సీరియస్ చర్చే జరుగుతోంది.